ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకరి పాపం..ఎందరికో శాపం..

ఎన్నడూ చూడని విధంగా కరోనా ప్రజల్ని భయపెడుతోంది. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోతూ తమ బిడ్డల భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టివేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. వైద్యానికి వెళ్లిన భర్తను చూడడం అదే ఆఖరిసారి అని ఆ భార్య ఊహించలేకపోతోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అర్ధాంగి అంతిమ సంస్కారాలకు రాలేని దయనీయాన్ని ఏ భర్తా అంచనా వేయలేడు. అప్పటి వరకు సరదాగా.. సంతోషంగా ఉన్న పచ్చని కుటుంబం మోడువారిపోతోంది. అభం శుభం తెలియని చిన్నారులు అనాథలవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. జనం మారడం లేదు. కిరాణా దుకాణం వద్ద కిటకిట. మాంసం కొనడానికి తహతహ.. టీకాకి వెళితే తోపులాట.. నిర్ధరణ పరీక్షకు వెళ్లినా అదే తీరు. ఇంతటి కర్కశానికి ఒడిగడుతోన్న మహమ్మారిని తరిమేద్దామనే స్పృహ లేకపోవడమే ఈ అనర్థాలకు ఊతం ఇస్తోంది.

covid positive candidate rooming on roads
covid positive candidate rooming on roads

By

Published : May 24, 2021, 3:39 PM IST

కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన ఓ తల్లి, కుమారుడు కొవిడ్‌, ఇతర ఆరోగ్య సమస్యలతో స్వల్ప వ్యవధిలోనే చనిపోయారు. ఆమె భర్త కొంతకాలం కిందట కాలం చేశారు. ఈ కుటుంబంలో కోడలితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రోడ్డున పడ్డారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

కలిదిండి మండలానికి చెందిన ఓ వ్యక్తి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వైద్యం నిమిత్తం విజయవాడ అసుపత్రిలో చేరి అక్కడే తుది శ్వాస విడిచారు. అతని భార్యకు కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఆమెను కూడా ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకుని ఇంటికి చేరినా.. భర్త మరణం బాగా కుంగదీసింది. ఆసుపత్రికి వెళ్లిన నాన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ ఇద్దరు పిల్లల మనోవేదన హృదయవిదారకంగా ఉంది.

మండవల్లి మండలానికి చెందిన ఓ ఆక్వా రైతుకు కొవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఆయన పరీక్ష చేయించుకుని.. యథాతథంగా బయట తిరిగారు. ఇది తెలియని కాపలాదారుడికి జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. మూడు రోజులకు కరోనాతో నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు. అతని తండ్రికీ కరోనా సోకడంతో పాటు.. కొడుకు చనిపోయిన బాధతో రెండు రోజుల్లోనే ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఆ వ్యక్తి భార్య, ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేనివారుగా మిగిలారు.

అన్నీ తెలిసి..

కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరమో మొదటి దశ వ్యాప్తి ద్వారానే ప్రపంచానికి చాటి చెప్పింది. తొలిదశ కంటే మరింత ప్రమాదకారిగా మారిన వైరస్‌కు ఎదురెళ్లుతున్నారు. ఈ క్రమంలో కొందరు చేస్తున్న తప్పిదాల కారణంగా మరికొందరు బలైపోతున్నారు. గతంలో లక్షణాలు కనిపించిన తరవాత వైద్య పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధరణ చేసుకున్న అనంతరం 14 నుంచి 28 రోజుల వరకు చికిత్స తీసుకునేవాళ్లు. అప్పట్లో మరణాల శాతం తక్కువగా ఉండేది. ఇప్పుటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చికిత్స తీసుకోవడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణానికి ముప్పు వాటిల్లుతోంది. ఇవన్నీ తెలిసి కూడా లక్షణాలు ఉన్నవాళ్లు.. పరీక్ష చేయించుకుని ఫలితం రాకుండానే యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దీనివల్ల జాగ్రత్తలు పాటించేవాళ్లకూ ముప్పు వాటిల్లుతోంది.

కుటుంబంలో అందరికీ..

గతంలో ఒక కుటుంబంలో ఒకరిద్దరికి మాత్రమే కరోనా వచ్చేది. రెండో దశలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా కుటుంబంలోని అందరికీ సోకుతోంది. కైకలూరులో ఒకే కుటుంబానికి చెందిన ఐదారుగురికి పాజిటివ్‌ వచ్చిన సంఘటనలు ఆర డజనుకు పైగా నమోదయ్యాయి. మనం బతుకుతూ ఇంటిల్లిపాదినీ, చుట్టుపక్కల వారిని బతికిద్దామనే స్పృహను పెంచుకోవాల్సిన తరుణమిది.

నిర్లక్ష్యాన్ని వీడాల్సిందే..

కరోనా లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యాన్ని వీడి వ్యక్తిగతంగా నిర్బంధాన్ని విధించుకోవాలి. పరీక్షలు చేయించుకున్నా ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాలి. ర్యాపిడ్‌ పరీక్షలను నమ్మి ఇష్టానుసారంగా తిరగకూడదు. ఆర్టీపీసీఆర్‌ చేయించుకుని దానిలో వచ్చే ఫలితాల ఆధారంగానే ప్రణాళిక చేసుకోవాలి. ఫలితాలు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.- అనీల, వైద్యాధికారి, మండవల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం

సమష్టి బాధ్యత..

కుటుంబంలో ఓ వ్యక్తికి కొవిడ్‌ లక్షణాలు బయట పడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సమష్టి బాధ్యతగా భావించాలి. ఆ వ్యక్తిని ఎలాంటి అవసరాలకు బయటకు పంపించకూడదు. తీవ్రతను అనుసరించి ఆసుపత్రిలో చేర్చించడం లేదా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో చికిత్స అందించడం వంటివి చేయాలి. అదే సమయంలో మిగిలిన సభ్యులు తగిన రక్షణ మార్గాలను అనుసరించాలి. అశ్రద్ధ వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.- దివి ప్రసాద్‌, వైద్యాధికారి, కలిదిండి పీహెచ్‌సీ

ఇదీ చదవండి:

కరోనా మృతుల్లో.. 65% పురుషులే..!

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది..వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details