Telugu youth shine in UPSC results : సివిల్స్ పరీక్షల్లో తెలుగుతేజాలు మరోసారి మెరిశాయి. తిరుపతిలోని ఎస్ వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పవన్‌దత్త మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 22వ ర్యాంకు సాధించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి సివిల్స్ వైపు మొగ్గు చూపినట్లు పవన్‌దత్త తెలిపారు. రాజమండ్రికి చెందిన మదళా తరుణ్ పట్నాయక్ గత సంవత్సరం సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించి ప్రస్తుతం సిమ్లాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్‌లో... శిక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సారి రెండో ప్రయత్నంలో 33వ ర్యాంకు సాధించాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికా జైన్ గత ఏడాది సివిల్స్ ఫలితాల్లో 128 ర్యాంక్ రాగా ఈసారి 69వ ర్యాంకు వచ్చింది.
యూపీఎస్సీ సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా.. జనరల్ కోటాలో 345 మంది, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 ఈడబ్ల్యూఎస్ నుంచి 99, మంది అర్హత సాధించారు. పోస్టుల వారీగా పరిశీలిస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపిక కాగా, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం తెలిసిందే.
తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంకు.. తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి జిల్లాకు చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకు, ఆ తర్వాతి స్థానాల్లో శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 20 ర్యాంకులు సాధించారు. అదే విధంగా రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్ 362, యప్పలపల్లి సుష్మిత 384 వ ర్యాంకు, సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకు సాధించారు.