ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడ అడవుల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు - mangroves spread in ap news

సముద్ర తీర ప్రాంతాల్లో సహజ రక్షణ గోడలు మడ అడవులు. వాటి విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. ఏపీ తీరంలోని నదీ సముద్ర సంగమ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా వెలసిన ఈ జీవావరణాలు... ప్రస్తుతం అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఉనికి కోల్పోతున్నాయి. రాష్ట్రంలోని కోరంగి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న మడ అటవీ ప్రాంతాలను సంరక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఫిష్ బోన్ విధానంలో వీటిని మరింతగా విస్తరింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

mangroves development planning in Andhra Pradesh
మడ అటవీ ప్రాంతాన్ని విస్తరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు..!

By

Published : Sep 29, 2020, 7:13 PM IST

దేశంలోనే రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతం సంరక్షణకు రాష్ట్ర అటవీశాఖ కార్యాచరణ సిద్దం చేసింది. ఏపీలోని కృష్ణా-గోదావరి నదుల సంగమ ప్రాంతంలో విస్తరించిన మడ అటవీప్రాంతంతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు పులికాట్ సరస్సు వద్ద విస్తరించిన ఈ మడ అటవీ ప్రాంతాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు చేసింది. ప్రస్తుతం 7 వేల హెక్టార్లలో ఉన్న మడ అటవీ ప్రాంతాన్ని 9442 హెక్టార్లకు విస్తరించేందుకు అధికారులు అవసరమైన ప్రణాళికలు చేస్తున్నారు.

సముద్రపు కోత నుంచి సహజ రక్షణ కవచంలా పనిచేసే ఈ మడ అటవీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట నరికి వేస్తుండటంతో క్షీణిస్తున్న ఈ సహజ కవచాలను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న కోరంగి మడ అడవీ అభయారణ్యం సఖినేటిపల్లి, తీరప్రాంత గ్రామాల వరకూ విస్తరించి ఉంది. అటు కృష్ణా నదీ సంగమ ప్రాంతంలోని మచిలీపట్నం - నాగాయలంక జోన్, గుంటూరు జిల్లా, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈ మడ అడవులు ఉండటంతో ఆయా ప్రాంతాల్లోనూ విస్తరణ కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

సొసైటీ ఫర్ ఎకోలాజికల్ రెస్టోరేషన్ సంస్థ సహకారంతో అటవీశాఖ గతంలోనే మడ అడవుల పెంపకం చేపట్టింది. ఆ తదుపరి చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు మళ్లీ మడ అడవుల నరికివేతకు కారణం కాగా... మరోమారు ఈ అంశంపై దృష్టి పెట్టనున్నారు. ఫిష్ బోన్ విధానం ద్వారా మడ అడవుల పెంపకానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. మడ అడవుల్లో నల్లమడ, తెల్లమడ, ఉప్పు పొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, చిల్లంగి, కళ్లతీగ, దబ్బగడ్డి వంటి మొక్క, వృక్షజాతులు పెరుగుతున్నాయి.

నీటి పిల్లులు, మొసళ్లు, డాల్ఫిన్లు, వేర్వేరు చేపలు, లాబ్ స్టర్ లాంటి రొయ్యరకాలు ఈ ప్రాంతాల్లోనే తమ ఆవాసం ఏర్పాటు చేసుకుంటుండంతో మడ అటవీ ప్రాంతాలు అతిపెద్ద జీవావరణాలుగా ఉంటున్నాయి. కలప సామగ్రితో పాటు రొయ్యల చేపల సాగుకోసం, ఓడరేవుల నిర్మాణ ప్రాజెక్టుల కోసం వీటిని కోట్టేస్తుండగా... తీవ్ర పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల వంద ఎకరాల మేర మడ అడవులను పోర్టు అభివృద్ధి ప్రాజెక్టు కోసం నరికి వేయటంతో ఎన్జీటీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ అభయారణ్యాల రక్షణ కోసం అటవీశాఖ ఈ కార్యాచరణ చేపట్టింది.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details