కరోనా లాక్ డౌన్ దృష్ట్యా నూజివీడు రసాల రుచికి వినియోగదారులు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో వారికి ఆర్డర్లపై మార్కెటింగ్ చేసేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. జిల్లా కలెక్టర్ ఏ.ఎండి. ఇంతియాజ్, నూజివీడు ఎంఎస్ఈ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు , జాయింట్ కలెక్టర్ కె . మాధవీలత స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మామిడి పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. నూజివీడు పరిధిలోని విస్సన్నపేట, ఎ.కొండూరు, చాట్రాయి. బాపులపాడు మండలాల్లో మామిడి సాగు అధికంగా ఉందన్నారు.
జిల్లాలో 23 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సంవత్సరం 1,84,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ప్రైవేట్ మార్కెట్ల నుంచి దేశంలో దిల్లీ, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు తదితర నగరాలకు నూజివీడు చిన్న రసాలు అధికంగా ఎగుమతి అవుతాయన్నారు. కరోనా ప్రభావంతో కొంత మేర అమ్మకాలు తగ్గినా ఉద్యానశాఖ అధికారులు పండ్ల అమ్మకాన్ని ప్యాకింగ్ చేసి నగరంలో అమ్మేందుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
రైతులు పండించిన మామిడి పండ్లను చెట్ల నుండి కోసి రైపనింగ్ ఛాంబర్ లో ఎథిలిన్ గ్యాస్ ద్వారా మగ్గ పెట్టి వినియోగదారులకు అందజేస్తున్నారరు. మెప్మా, డీఆర్డీఏ స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా 5 రకాల పండ్ల కిట్లు అంటే బంగినపల్లి మామిడి పళ్లు, జామ, అరటి, బొప్పాయి, నిమ్మ కేవలం 100 రూపాయలకే ఆర్డర్లు ఇచ్చిన వారి ఇళ్లకే చేరవేస్తున్నారన్నారు. అలాగే 5 కేజీల బంగినపల్లి, చిన్న... పెద్ద రసాలు కేవలం 250 రూపాయలకే సరఫరా చేస్తున్నారన్నారు.