ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవకాయ తయారీ భారమే!

తెలుగు ప్రజలకు అన్నంలో ఆవకాయ పచ్చడి లేకపోతే గొంతులో ముద్దయినా దిగదంటే అతిశయోక్తికాదు. ప్రతి రోజు ఇది లేకుండా భోజనం చేయమండోయ్‌ అనేవారు కోకొల్లలు. వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా ఏడాదిపాటు నిల్వ ఉండే మామిడి పచ్చడి తయారీతో సందడి చేస్తారు. ఏమైనా రాన్రాను దీని తయారీ ఖర్చు భారంగా మారుతోంది.

mango pickle
ఆవకాయ పచ్చడి

By

Published : May 15, 2021, 4:05 PM IST

ఏడాది పాటు నిల్వ ఉండేందుకు తయారీ చేసుకునే ఆవకాయ పచ్చడి ఖర్చు పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. 20 ఏళ్ల క్రితం వంద కాయలతో పచ్చడి తయారీకి రూ.300 నుంచి రూ.400 ఖర్చు ఉండేది. ఇప్పుడు రూ.5 వేలు వ్యయం చేయాల్సి వస్తోంది. అటు మామిడి కాయ, ఇటు ముడిపదార్థాల ధరలు 10 రెట్లు పెరగడమే కారణం. కృష్ణా జిల్లాలో ఏటా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో దీన్ని తయారు చేసుకుంటారు. మామిడి ఉత్పత్తులకు ప్రధాన కేంద్రంగా ఉండే నూజివీడు డివిజన్‌లో ఆవకాయ పచ్చడికి వినియోగించే పలు రకాల కాయలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ప్రతి ఇంటా 50 నుంచి 100 కాయలకు తగ్గకుండా పచ్చడి సిద్ధం చేసుకుంటారు. ఈ ఏడాది దీని తయారీ భారంగా ఉందని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారు.

జిల్లాలో 13 లక్షల వరకు కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 10 లక్షల కుటుంబాల వారు కచ్చితంగా ఆవకాయ, మాగాయ పచ్చళ్లు పెట్టుకుంటారు. ఇందుకు 5 వేల టన్నుల వరకు మామిడికాయల అవసరం ఉంటుంది.

ముడి పదార్థాల ధరలు ఇలా..

ఈ ఏడాది చిన్నరసం, తెల్లగులాబీ రకం 100 కాయల ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉంది. ఇక జలాలు కాయ ధర రూ.15 వరకు ఉంది. గాలిదుమ్ములకు కాయ నేల రాలడంతో కొరత ఏర్పడి ధర పెరిగింది. ఈ ఏడాది ఆవకాయ పచ్చడిలో వినియోగించే ముడిపదార్థాల ధరలు కిలో ఒక్కంటికీ మిరపకాయలు లావులు రూ.160, సన్నాలు రూ.140, వెల్లుల్లి రూ.140 వరకు, ఆవాలు రూ.120, మెంతులు రూ.130, పసుపు రూ.200, ఉప్పు రూ.10, నువ్వుల నూనె(పప్పునూనె) రూ.300 నుంచి రూ.350, శనగనూనె రూ.160 నుంచి రూ.180 వరకు ఉంది. ప్యాకెట్లలో లభించే నూనె ధర ఇంకా అధికంగా ఉంది. మిరపకాయలు మిల్లులో కారం పడితే కిలోకు రూ.35 తీసుకుంటున్నారు.

పచ్చడి మామిడి కొరతకు కారణాలివే..

* మామిడి రైతులు పలు కారణాలతో తోటలను నరికి వేస్తుండటంతో పచ్చళ్లకు వినియోగించే కాయల కొరత ఏర్పడింది. వానరాల బెడద, గిట్టుబాటు లేని ధరలు, స్థిరాస్తి వ్యాపారం ఊపందుకున్నాక మామిడి తోటలు కనుమరుగవుతున్నాయి.

* పదేళ్ల క్రితం వరకు జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉండేవి. క్రమేణా రైతులు 30 వేల ఎకరాల వరకు నరికేశారు. కొత్తగా కొన్నిచోట్ల తోటలు సాగు చేపట్టినా వాటిలో పచ్చళ్లకు వినియోగించే చెట్లు ఉండటం లేదు.

* సాధారణంగా పచ్చడి తయారీకి చిన్నరసం, తెల్లగులాబీ, ఎర్రగులాబీ, నీలాలు, జలాలు వినియోగిస్తారు. ప్రస్తుతం ఎర్ర గులాబీలు అందుబాటులో లేవు. ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో చిన్నరసం, తెల్లగులాబీలు, జూన్‌ నెల వరకు జలాల కాయలు అందుబాటులో ఉంటాయి.

రూ.6 వేల వరకు ఖర్చు చేశాం..

ఈ ఏడాది 100 చిన్నరసం కాయలతో ఆవకాయ, 50 పెద్దరసం కాయలతో మాగాయ పచ్చడి పట్టాం. వ్యయం రూ.6వేలు వరకు అయ్యింది. పదేళ్ల క్రితం కాయ ఒక్కింటికి రూ.2 వరకు ఉండేది. ఇప్పుడు రూ.12 చొప్పున కొన్నాం. నూనె, కారం తదితర ముడిపదార్థాల ధరలు ఈ ఏడాది విపరీతంగా పెరిగాయి. ఈ ధరలు ఒక్కో దుకాణంలో ఒక్కో రకంగా ఉన్నాయి. పచ్చడి సరకుల విషయంలో దోపిడీ చేస్తున్నారు. దుకాణాల వద్ద నిత్యావసర వస్తువుల ధరల బోర్డులు లేవు. - తుమ్మూరు విజయలక్ష్మి, గృహిణి, కనుమూరు

నాలుగేళ్లలో రెట్టింపు

ఆవకాయ పచ్చడి తయారీకి ఏటా రూ.2వేలు వరకు ఖర్చు చేస్తున్నాం. ఈ ఏడాది మామిడికాయలు, ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడంతో రూ.4వేలు వరకు వ్యయం చేయాల్సి వచ్చింది. పచ్చడి మామిడికాయ, నూనె ధరలు నాలుగేళ్లలో రెట్టింపయ్యాయి. ఇక్కడ పచ్చడి తయారీకి చిన్నరసం కాయలు అందుబాటులో ఉన్నాయి. వాటినే కొనుగోలు చేశాం. ఏటా పచ్చడి ముడిపదార్థాల ధరలు పెరగడం భారంగా ఉంటోంది.- చెరుకూరి లీలావతి, గృహిణి, ఊటుకూరు

దిగుబడి తగ్గడంతో పెరిగిన గిరాకి

ఈ ఏడాది మామిడికి ఈదురు గాలుల బెడద ఉంది. చెట్లకున్న కాయలు రాలిపోవడంతో కొరత ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం చిన్నరసం, తెల్లగులాబీ రకం కాయలు ఒక్కోటి రూ.5కు విక్రయించాం. మూడేళ్ల నుంచి వీటి ధర రూ.6 నుంచి రూ.10 వరకు ధర పెరిగింది. ఈ ఏడాది ఆవకాయ పచ్చడికి వినియోగించే చిన్నరసం, తెల్లగులాబీ రకం కాయలు ఒక్కోటి రూ.12 చొప్పున అమ్మాం. జలాలు అయితే ఒక్కోటి రూ.15 వరకు ఉంది. పచ్చడి మామిడి కాయలు దిగుబడి తగ్గడం, ఆ చెట్లు తక్కువగా ఉండటంతో ఉన్న కాయలకు గిరాకీ ఏర్పడి ధర పెరిగింది. -సింగంశెట్టి వెంకటేశ్వరరావు, మామిడికాయల వ్యాపారి, ఊటుకూరు

జిల్లాలో ఈ రకం చెట్లు తక్కువ

జిల్లాలో పచ్చళ్లకు వినియోగించే మామిడికాయల చెట్లు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆవకాయ పచ్చడికి చిన్నరసం, తెల్లగులాబీ, జలాలు, నాటురకం కాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది పచ్చడి మామిడి దిగుబడి తగ్గడంతో గిరాకీ పెరిగింది. అందుకే కాయ ఒక్కంటికి రూ.10 నుంచి రూ.12 వరకు విక్రయిస్తున్నారు. ఏటా దిగుబడి రావడం లేదని భంగినపల్లి రకం తోటలను రైతులు నరికేసి కొత్తగా మామిడి మొక్కలు నాటుతున్నారు. పచ్చడికి వినియోగించే రకం మొక్కలను రైతులు నాటడం లేదు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి చెట్ల పెంపకానికి రాయితీలు అందిస్తున్నారు. బంగినపల్లితో పాటు ఇతర రకాల మొక్కలు నాటాలని కర్షకులకు సూచిస్తున్నాం. - ఎన్‌.అశోక్‌, ఉద్యానాధికారి, గంపలగూడెం


ఇదీ చదవండి:వారంలోనే రూ.1.40 కోట్ల ఆదాయం

ABOUT THE AUTHOR

...view details