ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటు మామిడి.. ఇటు ధాన్యం.. అమ్ముకొనేదెలా? - krishna distrct

కృష్ణా జిల్లాలో మామిడి, ధాన్యం పంటలు విస్తృతంగా సాగు అవుతున్నాయి. ఏటా సీజను ఆరంభంలో వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి చేరుకొని రైతుల నుంచి పంట కొనుగోళ్లు ఆరంభిస్తారు. ఈ ఏడాది మాత్రం.. లాక్‌డౌన్‌ మామిడిపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుకు గిట్టుబాటు ధర కూడా రావటం లేదు. వ్యాపారం నిలిచిపోయింది. కోనుగోళ్లు లేక మామిడి మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరో పక్క.. ధాన్యం కొనే వారు లేక.. రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

krishna district
విసన్నపేట: కొనుగోళ్లులేక బోసిపోయిన మామిడి మార్కెట్‌

By

Published : Apr 30, 2020, 11:46 AM IST

కృష్ణా జిల్లావ్యాప్తంగా సుమారు 1.5లక్షల హెక్టార్లలో మామిడి పంట సాగవుతుండగా, దీనిలో సగానికి పైగా తిరువూరు, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లోనే ఉత్పత్తవుతోంది. ఏటా సీజను ఆరంభంలో వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి చేరుకొని రైతుల నుంచి పంట కొనుగోళ్లు ఆరంభిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎగుమతులు ఆరంభమవుతాయి.

నున్న, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఆరంభించి, పంటను తరలిస్తుంటారు. ఈ ఏడాది ఆరంభంలో కనీస గిట్టుబాటు ధర పలికిన మామిడి.. అనంతర కాలంలో దిగజారింది. లాక్‌డౌన్‌ మామిడిపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా తోతాపురి రకం ధర టన్నుకు రూ.6వేల నుంచి 8వేల లోపు ఉండగా, బంగినపల్లి రకం ధర టన్నుకు గరిష్ఠంగా రూ.20వేలకు మించి లభించని దుస్థితి నెలకొంది.

విస్సన్నపేటలో కొద్దిరోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ఆరంభించారు. తొలి ఒకటి, రెండురోజుల్లోనే దిల్లీ, అహ్మదాబాద్‌, బెల్గాం, కోల్‌కతా, జైపూర్‌ తదితర ప్రాంతాలకు రోజుకు సుమారు 250 టన్నుల మేర ఎగుమతులు సాగాయి.

వాతావరణంలో వస్తున్న మార్పులు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. చేతికొచ్చే మామిడిని కొనేవారు లేక, ఉన్న పంటను వర్షాలు, ఈదురుగాలుల నుంచి కాపాడుకునే దారి లేక కర్షకులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తడిచిన ధాన్యం చూసి మరింత నీరసపడిపోయారు.

నాణ్యతపై కూడా ప్రభావం చూపుతోంది

ఈనెల 9న డెల్టాలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం పడింది. 26, 27, 28 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరుసగా కురిసిన వర్షాలతో కోత కోసిన వరి పనలు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి రంగుమారింది. మంగళవారం కురిసిన వర్షానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో పాటు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసింది.

తిరువూరు, మైలవరం, ఎ.కొండూరు, గంపలగూడెం, నూజివీడు, జి.కొండూరు, వీరులపాడు, నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట మండలాల్లో రైతులు కూలీలతో ధాన్యాన్ని రాశులుగా పోసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిన్నటి వరకు పోటీపడిన వ్యాపారులు ప్రస్తుతం తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు.

నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో మరింత నష్టం వాటిల్లింది. ఎకరానికి టన్ను నుంచి టన్నున్నర వరకు మామిడి కాయలు నేల రాలినట్లు తిరువూరుకు చెందిన రైతు బండి మురళి తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా మహమ్మారిని ఇంట్లోనే మడత పెట్టే వ్యూహం!

ABOUT THE AUTHOR

...view details