కృష్ణా జిల్లాలో...
మండలి ఛైర్మన్ షరిఫ్, అంబేడ్కర్ చిత్రపటాలకు నందిగామ నియోజకవర్గంలో రైతులు, పలు పార్టీల నేతలు పాలాభిషేకం చేశారు. అనతరం నిర్వహించిన ర్యాలీలో మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు పాల్గొన్నారు. మండలి ఛైర్మన్ షరిఫ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ... కృష్ణా జిల్లా చందర్లపాడులో ముస్లింలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో...
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద చంద్రబాబు, మండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కదిరిలోని అంబేడ్కర్ కూడలిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు శాసనమండలి ఛైర్మన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయానికి రాజ్యాంగబద్ధంగా బ్రేకులు వేశారని హర్షం వ్యక్తం చేశారు.
కళ్యాణదుర్గం పట్టణంలో షరిఫ్కు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీ-కూడలిలో మండలి ఛైర్మన్ షరిఫ్, అంబేడ్కర్, చంద్రబాబు, లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఉరవకొండ పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్ షరిఫ్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మండలిలో ఛైర్మన్ షరిఫ్, అంబేడ్కర్ విగ్రహానికి రైతులు పాలభిషేకం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినందుకు రాజధాని ఐకాస నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ... మడకశిర పట్టణంలో షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఎంపిక సంఘానికి పంపిన శాసనమండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటానికి... కాకినాడలో తెదేపా కార్యకర్తల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
చిత్తూరు జిల్లాలో..
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తిరుపతి, కలికిరిలో అంబేడ్కర్ విగ్రహం, శాసనసమండలి ఛైర్మన్ షరిప్ చిత్రపటానికి తెదేపా నేతలు క్షీరాభిషేకం చేశారు.