Mandali Buddha Prasad Arrest: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో సాగుతున్న మట్టి మాఫియా ఆగడాలను నిలువరించాలని కోరుతూ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నిర్వహించ తలపెట్టిన నాగాయలంక తహశీల్దార్ కార్యాలయ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అవనిగడ్డలోని బుద్ధప్రసాద్ ఇంటి వద్ద నుంచి కార్యకర్తలతో కలిసి నాగాయలంక బయలుదేరిన బుద్ధప్రసాద్‌ను ఇంటి బయటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు ఓ వైపు అడ్డగిస్తుండగానే బుద్ధప్రసాద్‌ను పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. దీంతో పోలీసుల వాహనానికి కార్యకర్తలు అడ్డుగా బైఠాయించారు.
Buddha Prasad Arrest News: కార్యకర్తలను పక్కకు తప్పించి.. పోలీసులు బుద్ధప్రసాద్‌ను 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒకానొక సమయంలో బుద్ధ ప్రసాద్ పడిపోయే పరిస్థితి నెలకొంది. దోపిడీని అడ్డుకోవాలని తాము గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తామంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమనీ.. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు ఇలా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో డాక్టర్ శ్రీహరి హత్య కేసును ఛేదించటంలో విఫలమైన పోలీసులు.. ఇలా తమపై ప్రతాపం చూపించడం పోలీస్ శాఖకు సిగ్గు చేటని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసినా ఈ ఉద్యమం ఆగదనీ.. ప్రజా ఉద్యమం కొనసాగుతుందని.. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తామని బుద్ధప్రసాద్ ప్రకటించారు.