చోరీ చేసిన సొత్తును అమ్ముతున్న ఓ దొంగను జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం విజయవాడలోని ఓ షోరూంలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఉన్న వాహనాన్ని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. వాటిలో ఒక్కో వస్తువును 500రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
ఫాస్టాగ్ ఆధారంగా..
విజయవాడ రూరల్ మండలం వద్ద ఉన్న ఎల్‌జీ షోరూం గోడౌన్‌లో పలు ప్రాంతాలకు టీవీలు, ఏసీలు, వాషింగ్‌మిషన్లు తీసుకువెళ్లేందుకు టాటా ఏస్ వాహనంలో ఆదివారం రాత్రి లోడును నింపి డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను దింపేందుకు యూపీ నుంచి లారీలతో వచ్చిన ముగ్గురు యువకులు ఈ విషయాన్ని గమనించారు. లోడు వాహనాన్ని తెల్లవారుజామున అపహరించుకుని హైదరాబాద్‌వైపు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 6గంటల ప్రాంతంలో డ్రైవర్ వాహనం తీసుకెళ్లేందుకు రాగా, అది కనిపించలేదు. దీంతో వెంటనే యజమానికి సమాచారం అందించాడు. ఆయన వెంటనే పటమట పోలీసులకు విషయాన్ని తెలపగా వారు అప్రమత్తమయ్యారు. వాహనానికి ఉన్న ఫాస్టాగ్ ఆధారంగా వివరాలు సేకరించగా హైదరాబాద్ మార్గంలో కీసర టోల్ గేటు దాటినట్లు గుర్తించి, వెంటనే చిల్లకల్లు పోలీసులకు తెలిపారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు గౌరవరం వద్ద జాతీయ రహదారి పక్కన రూ.500కే ఎల్‌ఈడీ టీవీ, వాషింగ్ యంత్రాలను అమ్ముతుండగా.. అనుమానం వచ్చిన స్థానికులు చిల్లకల్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి రాగానే ఒకడు పారిపోయాడు. మరొకడు చిక్కాడు. అతనిని విచారించగా, ఎనికేపాడు ఎల్‌జీ గిడ్డంగి నుంచి వాహనాన్ని చోరీ చేసిన విషయాన్ని అంగీకరించాడు.