భర్త తీరుతో విసిగి ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి కాపురానికి రప్పించేందుకు సొంతంగా ప్రయత్నాలు చేశాడు. పోలీసులనూ ఆశ్రయించాడు. ఫలితం కనిపించకపోవడంతో పోలీసులపై ఆగ్రహంతో బాంబు బూటకపు కాల్‌తో అర్ధరాత్రి పరుగులు పెట్టించాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి 18 రోజులు జైలుశిక్ష విధించారు.
భార్యపై కోపంతో.. బాంబు ఉందంటూ పోలీసులకు ఫోన్.. ఆ తర్వాత..
ఆ వ్యక్తికి భార్యతో తరచూ గొడవే. అతడి తీరుతో విసిగిపోయిన ఆమె పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి కాపురానికి రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరకు పోలీసులనూ ఆశ్రయించాడు. ఫలితం లేకపోవడంతో వాళ్లపై కోపంతో బాంబు ఉందంటూ బూటకపు ఫోన్ కాల్ చేశాడు.
సైదాబాద్ ఠాణా పరిధిలో మంగళ/బుధవారాల్లో జరిగిన ఈ సంఘటన పోలీసుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట రియాసత్‌నగర్ డివిజన్ రాజనర్సింహనగర్‌కు చెందిన మహమ్మద్ అక్బర్‌ఖాన్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగేవి. ఇటీవల పిల్లలను తీసుకుని భార్య చౌటుప్పల్‌లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లిపోయింది. కాపురానికి పంపాలని పలుమార్లు కోరినా ఫలితం లేక చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
మంగళవారం రాత్రి ఐఎస్‌సదన్ కూడలిలో మందిర్-మసీదు వద్ద బాంబు ఉందని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు వచ్చి అర్ధరాత్రి గాలించినా ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. కాల్ ట్రాక్ ద్వారా ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాంపల్లి ఏడో స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి లక్ష్మణ్‌రావు తీర్పు వెల్లడించారు.
TAGGED:
బాంబు ఉందని పోలీసులకు కాల్