Maize Farmers Marketing Problems : ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక.. రైతులు తంటాలు పడుతున్నారు. పంట కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. కొత్తగా విధించిన నిబంధనలు రైతులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వాటిని పాటించలేక.. మద్దతు ధరను కూడా కాదని తక్కువ ధరలకే మధ్యవర్తులకు రైతులు పంట విక్రయిస్తున్నారు. కొత్త నిబంధనలతో మొక్కజొన్న రైతులు పంటను ఎక్కడ, ఎలా అమ్మకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగుచేశారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతినకుండా ఎన్నో పాట్లు పడి పంటను రక్షించుకున్నారు. వచ్చిన పంటను అమ్మి అప్పులైనా తీర్చుకోవాలని ఆశించారు. దళారుల చేతుల్లో మోసపోకుండా.. పంట తామే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సంతోషపడ్డారు. అయితే రైతు భరోసా కేంద్రం అధికారులు విధించిన నిబంధనలు కర్షకుల ఆనందాన్ని ఆవిరి చేశాయి.
ఆరుగాలం శ్రమించి పంట పండించడం, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడం ఒక ఎత్తయితే.. దాన్ని అమ్ముకోవడం రైతులకు తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే అధికారులు చెప్పిన ప్రాంతానికి రైతులే పంటను తరలించాలని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా, కాటా, కూలీ ఖర్చులు రైతులే భరించాలన్న నియమం పెట్టారని వాపోతున్నారు. ఇలా అయితే మద్దతు ధర ఇచ్చినా గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరగా క్వింటాల్‌కు 19 వందల 62 రూపాయలు ఇస్తామని ప్రకటించింది కానీస.., రవాణా, కూలీ, కాటా ఖర్చులు పోనూ తమకు మిగిలేదేమీ ఉండదని రైతులు చెబుతున్నారు.