Machilipatnam Auto Nagar Faced lack of Facilities:మౌలిక సదుపాయాలు లేక మచిలీపట్నం ఆటోనగర్ నిర్మానుష్యంగా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మెకానిక్ షెడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో గత్యంతరం లేక యజమానులు ఇతర ప్రాంతాల్లో మెకానిక్ షెడ్లు నిర్మించుకుంటున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పోతేపల్లిలో ఆటోనగర్ ఏర్పాటుకు 2006లో భూమి కేటాయించారు. 47ఎకరాల విస్తీర్ణంలో 216 మందికి స్థలాలు పంపిణీ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి వసతులు కల్పించలేదు. సౌకర్యాల లేమితో ఆటోనగర్‌లో మెకానిక్ షెడ్ల ఏర్పాటుకు యజమానులు ముందుకు రావడంలేదు. వచ్చిన వారు సైతం సరైన వ్యాపారం లేక వెనక్కు వెళ్లిపోతున్నారు. ఆటోనగర్‌లో స్థలాలను మెరక చేయకపోవడంతో మురికి కూపాలుగా మారుతున్నాయి.
రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేక ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేసుకున్న వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా అక్కడి ప్రాంతం చెరువును తలపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని మెకానిక్ షెడ్లను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు చేసిన ఆలోచన నేటికి సత్ఫలితాలను ఇవ్వకా.. బురదలో పోసిన పన్నీరులా మారిపోయింది. మోటారు వాహనాల మెకానిక్లకు స్థలాలు ఇచ్చినా వసతుల లేకపోవడంతో ఇక్కడికి వచ్చేందుకు వారు విముఖత చూపుతున్నారు. మౌలిక వసతులు కల్పించక పోవడంతో స్థలాలు కేటాయించినా నిరూపయోగంగా మారిందని షెడ్లను నిర్వహిస్తున్నవారు వాపోతున్నారు.
"రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది మునిగిపోవడం ప్రారంభమైంది. మురుగునీరు పారే తూమును వారు మూసేశారు. మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా నీళ్లు లేవు. స్థలం ఉండి రాకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు." -రాఘవులు, మచిలీపట్నం