High Court on Ashok Babu Arrest: తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు సర్వీసు రికార్డు తారుమారు చేశారన్న అభియోగంపై సీఐడీతో దర్యాప్తు చేయించాలని ఏపీ లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆ తరహా ఆదేశాలివ్వడానికి లోకాయుక్తకున్న అధికారాలేమిటని ప్రశ్నించింది. దాని విచారణాధికార పరిధి ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇలాంటి చర్యలు జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. లోకాయుక్తను వ్యాజ్యంలో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును ప్రశ్నించింది. అధికారాలపై లోకాయుక్త వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరోవైపు ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా కేవలం లోకాయుక్త ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై కేసు నమోదు చేసినట్లుందని సీఐడీ తీరును ఆక్షేపించింది. సర్వీసు రిజిష్టర్‌లో విద్యార్హతలను ఎప్పుడు, ఎవరు తప్పుగా నమోదు చేశారనే ప్రాథమిక సమాచారం లేకుండా కేసు నమోదు చేయడమేంటని సీఐడీని నిలదీసింది. కేసు నమోదు చేసే ముందు అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? పరిశీలించారా? అని ప్రశ్నించింది. అధికారుల విచక్షణాధికారం మేరకు కేసులు నమోదు చేస్తారా? అంటూ సీఐడీపై మండిపడింది.
వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని, ప్రస్తుతానికి బెయిలు మంజూరు చేయవద్దని సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య కోర్టును అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు నమోదుకు ప్రాథమిక ఆధారాలేమిటి? నమోదు చేసిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? బెయిలు ఎందుకు మంజూరు చేయకూడదు? తదితర వివరాలపై కౌంటర్ వేయాలని ఆదేశించింది. లోకాయుక్తను ప్రతివాదిగా చేర్చాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. సర్వీసు రిజిష్టర్‌లో విద్యార్హతను మార్చారనే ఆరోపణతో తెదేపా ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబుపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు అశోక్‌బాబును అరెస్టు చేశారు. సీఐడీ తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని, బెయిలు మంజూరు చేయాలంటూ అశోక్‌బాబు శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా బెయిలు పిటిషన్ వేశారు.