లాక్ డౌన్ సమయంలో నిత్యవసర సరుకుల రవాణాలో భాగంగా కొందరు లారీ డ్రైవర్లు, క్లీనర్లు రాష్ట్రం విడిచి వెళ్లారు. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లి లోడు దించి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అనుమతి లేదని సరిహద్దు వద్ద ఆపేశారు. ఇదీ సరిహద్దుల వద్ద రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్లు, క్లీనర్ల దుస్థితి. పది రోజుల నుంచి సరిహద్దు వద్దే ఉండిపోయిన వీరు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమను ఎప్పుడు విడిచిపెడతారనే స్పష్టత కూడా లేకపోవటం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాలుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం వల్ల వాటి డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల సరకు దించేందుకు వెళ్లినా దింపేవారు లేక..... మరికొన్ని చోట్ల షోరూమ్‌లు, గోదాములు మూతపడటంతో లోడు ఎక్కడ దింపాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఎలాగొలా లోడు దింపి స్వస్థలానికి తిరిగి ప్రయాణమైతే సరిహద్దు దాటనియ్యటం లేదు. ఇచ్ఛాపురం రాష్ట్ర సరిహద్దు వద్ద పదిరోజులుగా 30వరకూ బళ్లు నిలిచిపోయాయి.
వివిధ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాదాపు 2500 లారీలు స్తంభించిపోయాయి. ఇవి తిరిగి వచ్చేందుకు అనేకసార్లు యజమానులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ఆంక్షలు లేవని చెప్తున్నారే తప్ప లారీలు మాత్రం కదలటం లేదు. ఇలా అయితే డ్రైవర్లు, క్లీనర్లు విధులకు రావటం కూడా కష్టమవుతుందని యజమానులు వాపోతున్నారు. ఈ ప్రభావం నిత్యవసరాల రవాణాపైనా పడుతుందని స్పష్టం చేస్తున్నారు. సరిహద్దు వద్ద ఇరుక్కుపోయిన డ్రైవర్లు, క్లీనర్లు తమ కష్టాలు వర్ణనాతీతమని వాపోతున్నారు.