లాక్డౌన్ కారణంగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కోసూరు శివారులోని ద్విచక్ర వాహనాల విడిభాగాలు తయారు చేసే కంపెనీ మూతపడింది. చేసేది లేక అక్కడ పనిచేసే కార్మికులు స్వస్థలాలకు బయలుదేరారు. వీరి అవసరాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు ముగ్గురు డ్రైవర్లు. యజమానికి తెలియకుండా కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేశారు. మూడు కంటైనర్లలో 40 మంది చొప్పున లోపల కూర్చోబెట్టి బయట నుంచి తాళం వేశారు.
ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించారు.. దొరికారు..
తమిళనాడు నుంచి బిహార్‌లోని ముజాఫర్ జిల్లాకు శుక్రవారం కంటైనర్లలో బయలుదేరారు కార్మికులు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడంతో ఆ సందేశం యజమానికి చేరింది. తనకు తెలియకుండా కంటైనర్లు వెళ్లడంతో అనుమానం వచ్చిన లారీ యజమాని.. ఆ తర్వాత వచ్చే టోల్‌ప్లాజా నిర్వాహకులకు సమాచారమిచ్చాడు.