Lorry Association Owners Suffering Burden Of Taxes: ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారంతో లారీలను నడపలేకపోతున్నామని అనంతపురం జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నెల 11న ఎమ్ఎస్ నెంబర్ ఒకటి జీవో విడుదల చేసి మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 వేలు ఉన్న త్రైమాసిక పన్నుని 5 వేల వరకు చెల్లించాలంటే ఆర్థిక భారంతో నష్టాలను చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఈ జీవో అమలుపై పునరాలోచన చేసి, రద్దు చేయాలని కోరుతున్నారు.
జాతీయ రహదాలపై దోపిడీలు:అనంతపురం జిల్లాలో 1500 కు పైగా లారీలు ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, పెనుగొండ ప్రాంతాల లారీలు జాతీయ రహదారుల గుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేస్తుంటాయి. జిల్లాలో పండించిన బత్తాయి, టమోటా ఇతర పండ్లను కర్ణాటక, మధ్యప్రదేశ్ డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అకాల వర్షాల కారణంగా రైతులకు పంటలు లేక లారీలకు బాడుగలు లేక లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ బాడుగ వచ్చినా సరే జాతీయ రహదాలపై దోపిడీలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఐదు కుటుంబాలు, పరోక్షంగా 30 మంది వరకు ఒక లారీ వలన ఉపాధి పొందుతున్నారని... ప్రస్తుతం అధిక పన్నుల భారం వలన వారి జీవనాధారంపై ప్రభావం పడుతుందని వాపోతున్నారు.
పన్నుల భారం: బాడుగలు లేక ఒకవైపు అధికారులకు లంచాలు ఇవ్వలేక మరోవైపు ఇబ్బందులు పడుతుంటే... ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పన్నుల భారంతో కోలుకోలేని దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య లారీలు నడపాలంటే కుటుంబాలు సైతం రోడ్డున పడాల్సి వస్తుందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు కట్టలేక , లారీలను నష్టాల్లో నడపాల్సిన పరిస్థితులు ఎదురై యజమానులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా రాబోతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పన్నుల భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.