కొవిడ్‌ను జయించినా.. దాని తాలూకు బాధలు వెన్నాడుతూనే ఉన్నాయి. అత్యధికుల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటివి దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఈ లక్షణాలు తగ్గుముఖం పట్టడానికి కొందరికి వారాలు, మరికొందరికి నెలలు పడుతోంది. కరోనాకు ఆలస్యంగా చికిత్స పొందినవారు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ఐసీయూలో ప్రాణవాయువు సేవలూ అవసరమవుతున్నాయి. వీరికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తోంది. కోలుకున్న తర్వాత ఇలాంటి వారిలో సుమారు 5-10 శాతం మందిలో ఏదో రకమైన సమస్య తలెత్తుతోంది. సుమారు 2 శాతం మంది ఆసుపత్రిలో తిరిగి చేరాల్సి వస్తోంది.
దీర్ఘకాలం వేధించే సమస్యలు
- 99-100 డిగ్రీల జ్వరం రావడం
- ఒళ్లు నొప్పులు
- తలనొప్పి
- కీళ్ల నొప్పులు
- నీరసం
- అలసట
- చిన్న విషయాలకే కంగారు పడడం
- ఏకాగ్రత తగ్గడం
- ఆకలి తక్కువగా ఉండడం
- కళ్లు తిరగడం
కొవిడ్ నుంచి కోలుకున్నాక ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి
- రక్తంలో ఆక్సిజన్ శాతం 92-94 కంటే తగ్గడం
- నడిచినప్పుడు ఆయాసంగా ఉండడం
- చేతులు నీలి రంగులోకి మారడం
- జ్వరం 101 డిగ్రీలు దాటుతుండడం
- తీవ్రమైన దగ్గు నిరంతరంగా బాధిస్తుండడం
- అయోమయ స్థితికి చేరుకోవడం
- మాటలు తడబడడం
- ఛాతీలో పట్టేసినట్లుగా ఉండడం
- భరించలేని తలనొప్పి, వాంతులు
- కళ్ల వాపు, కనుగుడ్డు లాగడం
- కళ్లు మసకబారడం
- కాళ్ల వాపులు
- నోటిపూత
- ఆహారం మింగడంలో ఇబ్బందులు
- మానసిక ఒత్తిడి పెరిగిపోవడం
- నిద్రలేని రాత్రులు గడపాల్సి రావడం
వైరస్‌ను జయించాక ఇలా చేయాలి
- రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో రోజూ పరీక్షించుకోవాలి. 94 శాతం కన్నా తగ్గుతుంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. కాళ్లలో వాపులున్నా, దగ్గు తీవ్రమవుతున్నా, ఛాతీ నొప్పి వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
- శరీరంలో నీరు తగినంత ఉండేలా చూసుకోవాలి. నోరు తడారిపోవడం, మూత్రం మంటగా లేదా చిక్కగా రావడం.. శరీరంలో నీరు తగ్గిందనడానికి సంకేతాలు. దాహం వేసినపుడూ శరీరంలో నీరు తగ్గిందని అర్థం. అందుకు తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
- కోలుకున్న తరువాత శారీరక శ్రమ ఎక్కువగా చేయకూడదు. గతంలో ఎంత సమయం వ్యాయామానికి కేటాయించేవారో అందులో 30-50 శాతం సమయం కేటాయించాలి. ఈ విధానాన్ని 6-8 వారాల పాటు అనుసరించాలి.
- ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక జబ్బులకు వాడుతున్న మందులను యథావిధిగా కొనసాగించాలి.
- తగినంత ప్రొటీన్ ఉండేలా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక వేసుకోవాలి. టీవీ, ఫోన్లు చూస్తూ రాత్రిళ్లు 12 లేదా 2 గంటల వరకు మేల్కొనకూడదు. ముఖ్యంగా భయాందోళన కలిగించే, మనసు కలచివేసే దృశ్యాలను చూడకూడదు. ఇష్టమైన వ్యక్తులు, స్నేహితులతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. పుస్తకాలు చదివేందుకు ప్రాధాన్యమివ్వాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
ఇంటికెళ్లినా అప్రమత్తంగా ఉండాల్సిందే
కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో ప్రధానంగా శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడుతోంది. కొందరిలో ఊపిరితిత్తులు గట్టిపడిపోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘ఫైబ్రోసిస్’ అంటారు. ఫైబ్రోసిస్ వచ్చిన ప్రాంతం గట్టిపడిపోయి, శ్వాసకోశాల సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. రక్తంలోకి ఆక్సిజన్‌ను పంపించే ప్రక్రియ మందగించి ఆయాసం వస్తుంది. ఎక్కువమందిలో ఈ సమస్యకు తగిన మందులు వాడడం ద్వారా ప్రమాదకరంగా మారదు. ఊపిరితిత్తుల్లో కొంత నష్టం జరుగుతుంది కానీ.. అత్యధికులు కోలుకుంటారు. ఊపిరితిత్తులపై వైరస్ ఎంత మేరకు ప్రభావాన్ని చూపిందనే దాన్ని బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఫైబ్రోసిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొందరు ఇంటికెళ్లాక కూడా ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీరికి ప్రత్యేకంగా యాంటీఫైబ్రోటిక్స్, స్టెరాయిడ్స్ అందించాల్సి వస్తుంది. ఈ సమయంలో వారు ఎప్పటికప్పుడూ పల్స్ ఆక్సీమీటర్‌తో పరీక్షించుకోవాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం 93-94 శాతం ఉంటూ.. నడిచినప్పుడు 85-89 శాతానికి పడిపోతుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కొందరిలో ఎన్ని మందులు వాడినా ఫైబ్రోసిస్ తగ్గదు. వారిలో శ్వాసకోశాలు పూర్తిగా చెడిపోతాయి. అటువంటి వారికి ఊపిరితిత్తుల మార్పిడి అవసరమవుతుంది.
- డాక్టర్ ఎంవీ రావు, ప్రముఖ జనరల్ ఫిజీషియన్