'కాలయాపన మాని.. కరెంట్ కోతలపై దృష్టి పెట్టండి'
ట్వీటర్ వేదికగా సీఎం జగన్‌పై నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీపీఏల్లో అవినీతి లేదని ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)లిమిటెడ్ పేరుతో ఉన్న లేఖను జతచేసి ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శల దాడి చేస్తున్న నారా లోకేశ్.. మరోసారి బాణం వదిలారు. పీపీఏలపై అధికారులు, మేధావులు ఎంత చెప్పినా జగన్‌కి ఎక్కడం లేదంటూ మండిపడ్డారు. ''మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు... జగన్‌ని చూస్తుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా జగన్ చెవికెక్కలేదు. ఓ కమిటీ వేసి, ఏదో చేసేద్దామని, లేని అవినీతిని నిరూపించాలని కసిగా ఉన్నారు. మీ కసి నాకు నచ్చింది. కానీ ఎన్‌టీపీసీ వాళ్లకు నచ్చలేదనుకుంటా. అందుకే లెటర్ రాశారు. తెదేపా హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని, నాటి మార్కెట్ ధరల కంటే తక్కువకే కొనుగోలు ధరలు నిర్ణయించామని రాశారు" అని లోకేశ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఎన్టీపీసీ పేరుతో ఉన్న ఓ లేఖను ట్వీట్‌కు కలిపారు. ''బిడ్ల ఎంపిక విధానాన్ని జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా ప్రశంసించింది. ఏంటో! మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయకుండా ఏపీలో కరెంటు కోతల మీద దృష్టి పెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి'' అంటూ ట్వీట్ చేశారు.