ఇది కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామం. అన్ని గ్రామాల్లోలానే ఈ ఊరికీ కొన్ని సమస్యలున్నాయి. ఏళ్ల తరబడి పరిష్కారం కాక అలాగే ఉండిపోయాయి. కరోనా విజృంభిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో మార్చి 22న జనతా జర్ఫ్యూ విధించారు. సరిగ్గా జనతా కర్ఫ్యూకి కొన్ని రోజుల ముందు విదేశాలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కొంత మంది గ్రామానికి వచ్చారు.
కర్ఫ్యూ, లాక్డౌన్తో విధులకు వెళ్లేందుకు వీలులేని కారణంగా.. వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మిత్రుల సాయంతో ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఎవరో వస్తారు... ఏదో చేస్తారు అని ఎదురుచూస్తూ కూర్చోకుండా.... ఆ సమస్యల పరిష్కారానికి గ్రామస్థులు, యువత కలిసి నడుం బిగించారు. ముందుగా గ్రామం పేరుతో ఉన్న ఫేస్ బుక్ లో ఊరి సమస్యలు, వాటికి పరిష్కారం తెలపాలంటూ సందేశం ఉంచారు. అలా పలువురు నుంచి సమస్యలు తెలుసుకుని..... 90 మంది కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు.
అలా ఊర్లో సమస్యలను, వాటికి పరిష్కార మార్గాలను కనుగొని ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ముందుగా చిన్న చిన్న సమస్యలు గుర్తించి... గ్రూపులోని సభ్యులే తలో చెయ్యి వేసి వాటిని పూర్తి చేశారు. గ్రామంలో గ్రంథాలయం సమీపంలో... గతంలో రోడ్లపై మురుగు నీరు వెళ్లే అవకాశం లేక సిమెంట్ రోడ్డుపైనే ప్రవహించేది. దీనికి తోడు సిమెంటు రోడ్డుపై పగుళ్లు ఏర్పడిన కారణంగా.. వాహనచోదకులు కొన్నిసార్లు ప్రమాదాలకు గురయ్యారు.
ఈ సమస్యకు పరిష్కారంగా.. మురుగు నీరు రోడ్డుపై ప్రవహించకుండా ఇరువైపులా కాలువను వెడల్పు చేశారు. పగుళ్లకు.... తారుతో పూతవేశారు. సిమెంట్ రోడ్డు మార్జిన్ సరిగా లేక ప్రమాదాలకు కేంద్రంగా మారగా.. అక్కడ మట్టిపోసి సమస్యను పరిష్కరించారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఉన్న చిన్న తూములను తొలగించి వాటి స్థానంలో పెద్ద తూములు ఏర్పాటు చేసి మురుగునీరు సులభంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఇక గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న పంట పొలాలకు వెళ్లే దారిని బాగుచేయాలని సంకల్పించారు. గతంలో ఈ దారి పూర్తిగా గుంతల మయంగా ఉండటం, వర్షం వస్తే రాకపోకలు సాగించేందుకు అస్సలు వీలుకాని కారణంగా.. ప్రభుత్వంపై ఆధారపడకుండా గ్రామస్థులే రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రైతులందరి నుంచి తలాకొంత నగదు పోగు చేసి 3 కిలోమీటర్ల మేర సొంతంగా గ్రావెల్ తో రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్థులు, యువత, రైతులే కూలీలుగా మారి అందరూ కలిసి పనిపూర్తి చేశారు.