కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో తాజా పరిస్థితులపై నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అధికారులు, కింది స్థాయి సిబ్బందికి సూచలు, సలహాలు ఇస్తున్నారు. నగర ప్రజలకు అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని తెలుసుకున్నారు. మరోవైపు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాల ఆధారంగానూ వెంటనే స్పందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.
కైకలూరులో లాక్‌డౌన్
లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు సడలించడంతో కృష్ణాజిల్లా కైకలూరులో జనం భారీగా దుకాణాల వద్ద కొనుగోళ్లు జరుపుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించేందుకు పోలీసులు దుకాణాల ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
క్వారెంటైన్గా అద్దెకు రాక్ ఫౌండేషన్ భవనం
కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా అనుమానితులను క్వారెంటైన్లో ఉంచేందుకు రాక్ ఫౌండేషన్ భవనాన్ని రెవెన్యూ అధికారులు అద్దెకు తీసుకున్నారు. భవన యజమానులు ఇచ్చిన రూములను వైద్య అధికారుల పర్యవేక్షణలో మండల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు శుభ్రం చేయించారు. కరోనా అనుమానితులకు వైద్యం చేయించేందుకు ఆ గదులను ఉపయోగిస్తామని ఆయన అన్నారు.
విజయవాడ నగరంలో పారిశుద్ధ్య పనులు
విజయవాడ నగరంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైన క్రమంలో... నగర పాలక సంస్థ పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలు పిచికారీ చేస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు, వీధి వీధికి వెళ్తూ నగర పాలక సంస్థ సిబ్బంది రసాయనాలు చల్లుతున్నారు. సోడియం హైడ్రో క్లోరైడ్ అనే రసాయనం ఒక వంతును.. పది వంతు నీటిలో కలిపి ట్యాంకర్ల ద్వారా విస్తృతంగా రోడ్లపై చల్లుతున్నారు. ఈ రసాయనాన్ని ఒకసారి పిచికారీ చేస్తే మూడు రోజుల పాటు పనిచేస్తుంది.