Lack of Basic Facilities in Jakkampudi Colony: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం విజయవాడ జక్కంపూడి కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారడంతో స్థానికులు రోగాలపాలవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. కాలనీలో దాదాపు 50 వేల మంది నివాసం ఉంటున్నారు. డ్రైనేజీ కోసం పైపులు వేసినా.. అవి పాడైపోవడంతో మురుగునీరు తమ నివాసాల్లోకి వస్తోంది.
డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదని.. అదేమని కార్పొరేషన్ అధికారులను అడిగితే సిబ్బంది లేరని సమాధానం చెబుతున్నారని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీరు తాగునీటి సంపులో కలిసిపోతుందని, ఆ నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. కాలనీ చుట్టు మురుగునీరు పారుతుండంతో.. దోమలతో నరకం చూస్తున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీలో గుక్కెడు నీరు తాగాలన్నా కష్టంగా ఉందంటున్నారు. ప్రతి ఇంటిలో.. నాలుగైదు సార్లు డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ వంటి రోగాల బారిన పడతున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే, స్థానిక నేతలు ఎవరూ తమ సమస్యపై ఆరా తీయడంలేదని వాపోతున్నారు.
కాలనీలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో.. ఇక్కడ జీవనం సాగించలేక చాలామంది కాలనీని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. డ్రైనేజీ మురుగు నీరు మంచినీటి సంపులో కలువకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తాగునీరు సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.