కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో విడత ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. గుడివాడ నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 1968 వార్డులు ఉండగా 940 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం 1025 వార్డులకే ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో మూడు వార్డులకు నామపత్రాలు లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ డివిజన్‌లో 211 పంచాయతీల్లో 36 ఏకగ్రీవం అయ్యాయి. 34 పంచాయతీల్లో పూర్తిగా సర్పంచి పదవులు, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం విశేషం. ఈ 34 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అవసరం లేకుండా పోయింది. దీంతో పోలింగ్ కేంద్రాలు తగ్గనున్నాయి. ఈనెల 13న (శనివారం) ఈ డివిజనులోని పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 6.30గంటల నుంచి 3.30గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అనంతరం లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచి ఎన్నిక ఉంటాయి.
రెండు పంచాయతీల్లో..
ఈ డివిజనులో రెండు పంచాయతీల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. 10వేల జనాభా దాటిన పంచాయతీలు కైకలూరు, పామర్రు ఉన్నాయి. రెండూ నియోజకవర్గ కేంద్రాలు కావడం విశేషం. రెండింటిలోనూ పోరు ఆసక్తికరంగా మారింది. కైకలూరులో 21292 (2011 ప్రకారం) జనాభా ఉన్నారు. ఓటర్లు 2019 ప్రకారం 15,245 మంది ఉన్నారు. ఈ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు బలపర్చిన అభ్యర్థినిగా నవరత్న కుమారి పోటీలో ఉన్నారు. ప్రత్యర్థిగా కారె రాజారాణి పోటీలో ఉన్నారు. ప్రచారం హోరాహోరీగా సాగింది. రెండు వర్గాల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. మరో ప్రధాన పంచాయతీ పామర్రు. ఇది కూడా నియోజకవర్గ కేంద్రం. దీన్ని ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ బలపర్చి మద్దతు ఇచ్చిన అభ్యర్థిగా కస్తూరి పోటీలో ఉన్నారు. ప్రత్యర్థిగా శీలం పెద్దంట్లమ్మ పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్థానికంగా లేరు. ఆమె క్రియాశీలకంగా లేరు. మండల స్థాయి శ్రేణులు పాల్గొంటున్నాయి. ఈ రెండు పంచాయతీల్లో ఉత్కంఠ రేపుతోంది.
కొల్లేరు ప్రభావం..!
రెండో విడత పల్లెపోరులో గుడివాడ, కైకలూరు నియోజకవర్గాలు పూర్తిగా, పామర్రు పాక్షికంగా ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 9 మండలాలు. కొల్లేరు సరస్సు ప్రభావం ఎక్కువగా ఉంది. చేపలచెరువు, రొయ్యల గుంటల వ్యాపారులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. మండవల్లి, కైకలూరు మండలాల్లో ఇది కనిపిస్తోంది. మండవల్లి మండలం చింతపాడు పంచాయతీ ప్రత్యర్థులకు ప్రతిష్ఠాత్మకంగా తయారైంది. ఇక్కడ ఓటుకు రూ.5వేల వరకు పంపిణీకి సిద్ధమయ్యారు. కేవలం 1191 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో నువ్వానేనా అన్నట్లు పోరు ఉంది. రూ.కోటి వరకు ఖర్చుకు వెనకాడేది లేదని మద్దతుదారులు చెప్పుకొంటున్నారు. ఇది బీసీ మహిళకు కేటాయించారు. మరో పంచాయతీ ఇంగిలిపాకలంకలోనూ రూ.50లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది బీసీ మహిళకే రిజర్వు అయింది. కేవలం 1048 ఓట్లు ఉన్నాయి. కైకలూరు మండలం దొడ్డిపట్ల పంచాయతీలోనూ రూ.5వేల వరకు ఇస్తామని హామీ ఇస్తున్నారు. 1263 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గుడివాడ నియోజక వర్గంలో ఎక్కువ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
నేటితో ఉపసంహరణ!
మూడో విడత జరిగే బందరు డివిజనులోని పంచాయతీలకు శుక్రవారం నాటితో ఉపసంహరణ గడువు ముగుస్తోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజనులో ఏకగ్రీవాలకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బందరు, పెడన, అవనిగడ్డ పూర్తిగా, పామర్రు నియోజకవర్గంలో పాక్షికంగా ఎన్నికలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే ఏకగ్రీవాల కోసం తీవ్ర హెచ్చరికలు చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ప్రత్యర్థులను నిలబెట్టి మద్దతు ఇచ్చినా.. గెలిపించినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావంటూ హెచ్చరించడం కలకలం రేపింది. శుక్రవారం ఉపసంహరణతో ఒక రూపు రానున్నాయి. మూడో విడత జరిగే ఎన్నికల్లో అవనిగడ్డ, చల్లపల్లి, లక్ష్మీపురం కోడూరు పంచాయతీలు 10వేల జనాభా పైన ఉన్నాయి. మూడో విడత పోలింగ్ 17న జరగనుంది.
భారీగా నామినేషన్లు!
నాలుగో విడత, చివరి పోలింగ్ ఈ నెల 21న జరగనున్నాయి. నూజివీడు డివిజన్‌లోని 14 మండలాల్లో 288 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. 2990 వార్డులు ఉన్నాయి. తిరువూరు, నూజివీడు, గన్నవరం, మైలవరం, పామర్రు నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి.
ప్రలోభాల వల
పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో నేతలంతా సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. అధికారంగా రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. వాటి ప్రభావం అనేక చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో నియోజకవర్గ పెద్దల జోక్యం తప్పలేదు. అభ్యర్థులంతా మధ్యాహ్నానికే ప్రచారాన్ని పక్కన పెట్టి బుజ్జగింపులు, ప్రలోభాలకు తెరతీశారు. పల్లె రాజకీయం మరింత వేడెక్కుతోంది.
తిరుగుబాట్ల నియోజకవర్గంలోని 91 పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీ జరుగనుంది. వీటిలో సుమారు 25 చోట్ల అధికార పక్షానికి చెందిన తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని నాయకులు ఎంత బుజ్జగించినా ప్రయోజనం లేకుండా పోయింది. మండవల్లి, కానుకొల్లు, చింతపాడు, కొవ్వాడలంక, లోకుమూడి, పెరికెగూడెం, విజరం, గోపవరం, వడాలి, వణుదుర్రు, శ్రీహరిపురం, అల్లూరులో ప్రధాన పక్షానికి తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో కొనసాగుతున్నారు. శీతనపల్లిలో మరో పక్షానికి చెందిన తిరుగుబాటుదారులు పోటీపడుతున్నారు. రెబల్స్ ధాటికి ఓటర్ల నాడిని పట్టడం అసలైన అభ్యర్థులకు కష్టంగా మారుతోంది.