కరోనా విషయంలో తీసుకున్న ప్రతి చర్యనూ సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సొంత కితాబు ఇచ్చుకోవద్దని పేర్కొంది. లోపాల్ని సరిదిద్దుకొని మరింత మెరుగైన సేవలు ఎలా అందించవచ్చో ఆలోచించాలంది. అంతా నియంత్రణలో ఉందనే భావన వద్దని హితవు పలికింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుముల వసూలును, బెడ్‌లు నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. చేర్చుకోవడానికి అధిక రుసుము డిమాండ్ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంది.
ఆసుపత్రిలో చేరే విషయంలో సమస్య తలెత్తితే.. సంప్రదించేందుకు నోడల్ అధికారి పేరు, ఫోన్ నంబరు ప్రదర్శించాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో అక్రమాలపై నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్ని తనిఖీలు చేసిందో.. ఏం గమనించిందో మోమో దాఖలు చేయాలని స్పష్టంచేసింది. నోడల్ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్నీ పరిశీలించాలని తెలిపింది. విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో కేసులు పెరిగితే ఆక్సిజన్, బెడ్‌ల కొరత, సౌకర్యాల లేమిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పింది. పరిస్థితులు చేయి దాటకూడదనేది తమ అభిప్రాయమని పేర్కొంది.
కరోనా బాధితులకు ఐసొలేషన్ కేంద్రాల్లో ప్రవేశం కల్పించడం లేదని కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విచారణ మే 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా విషయమై సామాజిక కార్యకర్త, పాత్రికేయుడు తోట సురేశ్‌బాబు, ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలుచేశారు. వీటిపై హైకోర్టు బుధవారం లోతైన విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పొత్తూరి సురేశ్‌కుమార్ వాదనలు వినిపించారు. ‘కొన్ని ఆసుపత్రుల్లో బెడ్‌లు నిరాకరిస్తున్నారు.