అబ్కారీ శాఖ తమను అక్రమంగా ఉద్యోగాల్లోనుంచి తొలగించిందని ఆరోపిస్తూ మద్యం దుకాణాల సూపర్ వైజర్లు, సేల్స్ మెన్ అమరావతి సచివాలయం వెలుపల ఆందోళన చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 తేదీ వరకూ ఒప్పందం ఉన్నప్పటికీ ముందుగానే తమను తొలగించారని వారు ఆరోపించారు. ప్రభుత్వం మద్యం ధరలు పెంచి దుకాణాలు తగ్గించిందన్నారు. ఈ కారణంగా తమను ఉద్యోగాల్లోనుంచి తీసేయడం సరికాదంటూ వారు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా ఎక్సైజు శాఖ తమకు సమచారమేదీ ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యోగం వచ్చిందని ఆనందించే లోపే కోల్పోవటం బాధకరమన్నారు. రెండు నెలలుగా జీతాలనూ చెల్లించలేదని ఏపీ బెవరేజ్ కార్పోరేషన్లో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు సూపర్ వైజర్లు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంను, మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.