అడవిలో విహరించాల్సిన చిరుత పొలాల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా రాజుపేట తండాలో ముళ్లకంచెలో చిక్కుకుకుని విలవిల్లాడింది. అటవీ అధికారులు శ్రమించి చిరుతను బయటికి తీశారు. రాజుపేట తండా గ్రామ శివారులో కృష్ణ నాయక్ వ్యవసాయం చేస్తున్నాడు. పంటకు రక్షణగా ముళ్లకంచెను ఏర్పాటు చేసుకున్నాడు. చిరుత పొరపాటున వచ్చి ముళ్లకంచెలో ఇరుక్కుంది. విలవిల్లాడుతుండగా స్థానికులు గమనించారు.
చిరుతను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమించారు. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి యత్నించారు. ఎట్టకేలకు సురక్షితంగా బోనులో బంధించారు. ఈక్రమంలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి.