ఒకవైపు కరోనా, మరోవైపు వరదల వల్ల రాష్ట్రం నలిగిపోతోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. గోదావరి వరద నీరు ఉప్పొంగుతున్న కారణంగా అనేక లంక గ్రామాలకు బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయని... వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని ఆరోపించారు. ముంపునకు గురైన గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏటువంటి సహాయం అందటం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అధిక సంఖ్యలో రైతులు నష్టపోయారని... వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.