ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

steel plant: ఐక్య పోరాటాలే శరణ్యం.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. విశాఖ ఉక్కుపై ఏకగ్రీవ తీర్మానం - విశాఖ ఉక్కు పరిశ్రమ

Visakhapatnam steel conservation struggle platform : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... అనే నినాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై విజయవాడలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా అపేందుకు మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపడుతున్నట్లు నేతలు చెప్పారు.

రౌండ్ టేబుల్ సమావేశం
రౌండ్ టేబుల్ సమావేశం

By

Published : Apr 19, 2023, 7:48 PM IST

Visakhapatnam steel conservation struggle platform : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం దగ్గర పడిందని వివిధ పార్టీల నేతలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్​రావు, కాంగ్రెస్ నేత నరహరశెట్టి నరసింహారావు, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, ప్రజా, పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిరూపమే విశాఖ ఉక్కు పరిశ్రమ అని వక్తలు తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% సామర్థ్యంతో కేంద్ర ప్రభుత్వం నడిపించాలని పోరాట వేదిక నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అనేక సందర్భాలలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కాపాడాలని కార్మికులు పోరాటం చేస్తుంటే.. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆ తరువాత చంద్రబాబు కూడా కేంద్ర ‌నిర్ణయాలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానిని కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితిని వివరించాలన్నారు. కార్మికులతో పాటు వామపక్ష, టీడీపీ నేతలు అందరూ దీక్షలు చేపట్టారని.. అయినా కేంద్రంలో మార్పు లేదన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏ కార్యక్రమం చేపట్టినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.

ఉద్దేశ పూర్వకంగా నష్టాల్లోకి.. 2021-2022లో విశాఖ ఉక్కు పరిశ్రమ దాదాపు రూ.948 కోట్ల లాభాలు ఆర్జించిందని, ఈ లాభాల మొత్తాన్ని ముడిసరుకు కొనడానికి ఉపయోగించకుండా అప్పుల చెల్లింపుల పేరుతో బ్యాంకులకు చెల్లించినట్లు నేతలు చెప్పారు. ముడిసరుకు కొనడానికి డబ్బులు లేవనే సాకుతో ఉత్పత్తిని భారీగా తగ్గించారని తెలిపారు. గ్లాస్ ఫర్నేస్-3 పూర్తిగా మూసివేశారని, పరిశ్రమలో ఇతర అనేక విభాగాల ఉత్పత్తిని తగ్గించారని, దీని ఫలితంగా దేశంలోని అన్ని ఉక్కు పరిశ్రమలకు వేల కోట్ల లాభాలు వస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ మాత్రం సుమారుగా రూ.3 వేల కోట్ల నష్టాన్ని చవి చూసిందని నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై కుట్ర చేసి నష్టాలు వచ్చేలా చేసిందని ఆరోపించారు. ఈ నష్టాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తూ.. కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖ ఉక్కుపై ఉదయం ఒకమాట, సాయంత్రం మాట మార్చడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు, మీడియా ఇదో పెద్ద సమస్యగా చర్చలు చేస్తున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమ సంక్లిష్టమైన సమస్య కానే కాదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిలు రామకృష్ణ, శ్రీనివాసరావు అభిప్రాయ పడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్లే తీసుకుని పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ బిడ్స్ లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోందని... నిజంగా అదే జరిగితే ఏపీ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్నట్లే అని అన్నారు.

తెలుగు వారి పౌరుషం తగ్గిందా.. విశాఖ ఉక్కు పరిశ్రమకు ముడిసరుకును సమకూర్చగలిగిన పూర్తి సామర్థ్యం కేంద్ర ప్రభుత్వంలోని సెయిల్, ఎన్ఎండీసీకి ఉన్నా.. ఆ ఆలోచన కేంద్రం చేయడం లేదని ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన తప్ప అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం కనిపించడం లేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామంటున్నా.. ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తూ.. తెలుగు వారి పౌరుషం తగ్గిందా, చచ్చి పోయిందా అని అన్నారు. జాతి ‌ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలే రాజకీయ పార్టీలకు ముఖ్యమైపోయాయని, ఢిల్లీలో‌ శాసించే స్థాయి నుంచి‌ అర్థించే స్థాయికి దిగజారాయని అవేదన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని, ఇప్పటికైనా నిద్ర నటించకుండా జాతీయ స్థాయిలో ఐక్యంగా ఉద్యమిద్దామన్నారు. ఆడలేక మద్దెలు దరువు అన్నట్లు.. కొందరు ముఖ్యమంత్రి జగన్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి విమర్శించారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కార్మిక వర్గంతో చర్చలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలతో సంతకాలు చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు.

స్వల్ప వాగ్వాదం.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో స్వల్ప గందరగోళం నెలకొంది. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసే విషయంలో నేతల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ పై సీపీఐ రామకృష్ణ, వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ప్రధానిని కలిసే విషయంలో సీఎం హోదాలో జగన్ బాధ్యత తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా, సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించడంతో గందరగోళం నెలకొంది. వారి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని గౌతంరెడ్డి సూచించారు. ఇవి విమర్శలు కాదు.. ప్రభుత్వానికి మా‌ విజ్ఞప్తి అని రామకృష్ణ అనడంతో వివాదం సద్దుమణిగింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలన్న తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు నష్టపోతారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ప్రైవేటీకరణ వద్దని తము 797 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పరిగణలోని తీసుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి అందరూ సిద్ధం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కు పరిశ్రమను 100 శాతం సామర్ధ్యంతో నడిపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు..కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే 3న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించినట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక కన్వీనర్ ఓబులేసు తెలిపారు. నిద్ర నటిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తాము నిద్ర లేపుతామని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని పెర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, కార్మిక సంఘాల నేతలు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం మే నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఇందులో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details