అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పట్టణ, గ్రామీణ స్థాయిల్లో పెరిగిపోతున్న అక్రమ లేఅవుట్లను నిరోధించేందుకు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ లేఅవుట్లలో ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే వీల్లేకుండా నిబంధనలు విధించబోతున్నారు. ఈ మేరకు పట్టణ ప్రణాళిక విభాగం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చర్చించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆమోదంతో త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న అక్రమ లేఅవుట్లను చివరి అవకాశంగా క్రమబద్ధీకరించి...తర్వాత పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోనున్నారు.
కఠిన నిబంధనలు
లే అవుట్ పరిధిలోని నగరాభివృద్ధి సంస్థ, నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల నుంచి నిర్వాహకులు విధిగా లేఅవుట్ ప్రణాళిక నంబరు తీసుకోవాలి. అలాంటి వాటిలో మాత్రమే ప్లాట్లు విక్రయించే వీలుంటుంది. అనధికార లేఅవుట్లలో ఎవరైనా స్థలాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. స్థానిక సంస్థల నుంచి ఎల్పీ నంబరు తీసుకున్న లేఅవుట్లలో ప్లాట్లకు మాత్రమే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఇక రిజిస్ట్రేషన్ చేయనున్నది. రాజకీయ సిఫార్సులకు , అక్రమ వసూళ్లకు తలొగ్గి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్టేషన్లు చేయకుండా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు. తప్పుడు ఎల్పీ నంబర్లతో రిజిస్ట్రేషన్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సబ్‌రిజిస్ట్రార్ నగరాభివృద్ధి సంస్థ, పురపాలక సంఘాలకు లేఖలు రాసి నిర్ధారించుకోవాలి. తప్పుడు దస్తావేజులు పెట్టినట్లయితే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చదవండి :
అమరావతికి రూ.496కోట్లు ఇచ్చాం: కేంద్రమంత్రి