ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తక్కెళ్ళపాడు గ్రామంలో పూర్తయిన భూముల రీ సర్వే

భూమికి సంబంధించిన వివాదాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల రీ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామాన్ని ఎంపిక చేశారు. గడిచిన ఆరు నెలలుగా గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసిన అధికారులు సంబంధిత పత్రాలను రైతులకు అందజేశారు. అయితే సర్వేలో తప్పులు దొర్లాయని కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తక్కెళ్ళపాడు గ్రామంలో పూర్తయిన భూముల రీ సర్వే
తక్కెళ్ళపాడు గ్రామంలో పూర్తయిన భూముల రీ సర్వేతక్కెళ్ళపాడు గ్రామంలో పూర్తయిన భూముల రీ సర్వే

By

Published : Oct 20, 2020, 5:34 PM IST

భూముల రీ సర్వేలో తప్పులు దొర్లాయని.. తమ రికార్డుల్లో ఉన్న భూమిని తమకు చూపించి హద్దులు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి భూ రికార్డులు సవరించక పోవడం వల్ల ప్రతి గ్రామంలో భూమికి సంబంధించిన సర్వే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఒక్కో గ్రామంలో వేలకొద్ది సమస్యలు రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్​లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి భూ యజమానులు నిత్యం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు రీ సర్వే చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసింది. జనవరిలో మొదలైన సర్వే పనులు ఆగస్టు 19కి పూర్తి చేశారు. 20న యజమానులకు సర్వే రికార్డులు అందజేశారు.

వీటిపై అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలపాలని వాటిని 60 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు. రీ సర్వే కొలతల్లో 184 మంది హెచ్చుతగ్గులు వచ్చాయని అభ్యంతరాలు తెలిపారు. ఇప్పటికే 141 మంది అభ్యంతరాలకు పరిష్కారం చూపారు. ఇంకా 39 మంది అభ్యంతరాలను పరిష్కరించాల్సి ఉంది. 141 మంది లో 24 మంది మరోసారి అభ్యంతరాలను లేవనెత్తారు. ప్రధానంగా పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని పంచుకున్న సర్వేనెంబర్ లో ఎక్కువగా సమస్యలు తలెత్తాయి.

తక్కెళ్ళపాడు గ్రామంలో మొత్తం 1538.97 ఎకరాల భూమి ఉంది. దీనిలో 1268.60 ఎకరాల మెట్ట ఉంది. ప్రభుత్వ భూమి125.14 ఎకరాలు ఉండగా, 144 ఎకరాల అటవీ భూమి ఉంది. మొత్తంగా 150 సర్వే నెంబర్లతో ఈ భూమి ఉండగా సమగ్ర సర్వే తర్వాత సర్వే నెంబర్లు 531 కి పెరిగాయి.

15 సెంట్లు తక్కువగా వచ్చింది

నాకు 1.77 ఎకరాలు ఉంది. సర్వే తర్వాత 15 సెంట్లు తక్కువగా వచ్చింది. అధికారులకు ఫిర్యాదు చేశా.. వెంటనే స్పందించిన అధికారులు మరోమారు కొలత వేసి పది సెంట్లు పక్క భూములో ఉందన్నారు. అందుకు పక్క రైతులు ఒప్పుకున్నారు. కానీ ఇంకా ఐదు సెంట్ల భూమి రావాల్సి ఉంది. అధికారులు లేదని చెబుతున్నారు. సెంటు భూమి ధర లక్ష పలుకుతోంది. నా 5 సెంట్లు నాకు చూపించాలి.

-రవిబాబు, తక్కెళ్ళపాడు

పూర్వకాలం ఎటువంటి సర్వేలు రికార్డుల సరిచేయటం లేకపోవడం వల్ల భూమి హద్దుల్లో తేడాలు వచ్చాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వే ద్వారా అన్నింటినీ సరిచేసి భూ యజమానులకు రికార్డులు ఇచ్చాం. కొందరు రైతులు అభ్యంతరాలు తెలిపారు. వారి అభ్యంతరాలను 60 రోజుల్లోగా పరిష్కరించేలా ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. 27 అభ్యంతరాలు తమ పరిధిలో లేవు. వాటిని సబ్ కలెక్టర్, జెసీ స్థాయిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ప్రతి అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిష్కరిస్తాం.

-రామకృష్ణ, తహసీల్దార్ జగ్గయ్యపేట

ఇదీ చదవండి:పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ABOUT THE AUTHOR

...view details