తమ కష్టార్జితంతో దశాబ్దాల కిందట స్థలం కొని ఇళ్లు నిర్మించుకున్నారు. హక్కు పత్రాలూ ఉన్నాయి. వాటి మీద రుణాలు పొందారు.. వారసులకూ హక్కులు దఖలు పడ్డాయి. కానీ ఉన్నట్టుండి అవి సీలింగ్ భూములని, కోట్ల రూపాయలు కట్టి క్రమబద్దీకరించుకోవాలని ప్రభుత్వం నుంచి వస్తున్న నోటీసులు విజయవాడ, గుంటూరు నగరాల్లోని వేలాది కుటుంబాల్లో అలజడి రేకెత్తిస్తున్నాయి. తాతల కాలం నుంచి ఉంటున్న స్థలాలకు.. డబ్బులు కట్టాలని నోటీసులు వస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పట్టణ భూ పరిమితి చట్టం-1976 కింద సీలింగ్, మిగుల భూముల క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడమే దీనంతటికీ ప్రధాన కారణం.
నిరుపేదలనే కనికరమూ లేకుండా..
సీలింగ్ భూములకు కోట్ల రూపాయలు కట్టి క్రమబద్దీకరించుకోవాలని రాష్ట్రం ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధరకు ఒకటిన్నర రెట్లు కట్టమని నోటీసుల్లో పేర్కొంది. 2008 జూన్‌లో జారీ చేసిన 747జీవో ప్రకారం ఈ భూముల క్రమబద్ధీకరణకు ఉన్న మినహాయింపులనూ తొలగించేసింది. దీని స్థానంలో 2021 జనవరి 31న సవరణలతో 36 జీవో తెచ్చి.. భూముల బదలాయింపును కోట్లతో కూడుకున్న వ్యవహారంగా మార్చేసింది. అప్పట్లో ఇచ్చిన జీవోలో ఆక్రమితదారులపై భారం పడకుండా పలు మినహాయింపులు ఇవ్వగా.. ఇప్పటి జీవోలో కేవలం బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుపేదలనే కనికరమూ లేకుండా.. గతంలో ఉన్న ఉచితం అనే నిబంధన తొలగించి పెద్ద మొత్తంలో వసూళ్లకు సంకల్పించారు. నోటీసులు అందుకున్న వారు చెల్లించాల్సిన మొత్తం చూస్తే.. ఇంటిని వదులుకోవడమే మేలనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది. ఒకటికి మూడు, నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సమయంలో.. వస్తున్న నోటీసులతో వేలాది కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి.
ఇన్నాళ్లూ లేని భూ పరిమితుల చట్టం ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారో...
పట్టణ భూ పరిమితి చట్టం-1976 కింద నిషేధిత జాబితాలో ఉంటే ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ లేని భూ పరిమితుల చట్టం ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారో... తమకే ఎందుకు వర్తింపజేస్తున్నారో.. తెలియడం లేదని వాపోతున్నారు. తమ భూములు ఆ చట్టం కిందకు ఎప్పుడొచ్చాయనే విషయమూ ఇప్పటి వరకు తెలియదని పేర్కొంటున్నారు. విజయవాడ, సమీప మండలాల్లో కలిపి అర్బన్ సీలింగ్ యాక్టు కింద 1225 మందిని గుర్తించి మిగులు భూమి ఆక్రమణ కింద నోటీసులు ఇస్తున్నారు. దీనిలో భాగంగా పెనమలూరులో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లకు సంబంధించి 20 మందికి నోటీసులు జారీ అయ్యాయి. పోరంకిలో ఎకరం, కానూరులో ఎకరం విస్తీర్ణంలోని ప్లాట్లు గుర్తించి నోటీసులు సిద్ధం చేస్తున్నారు. కొంతమంది నోటీసులు తీసుకోవడం లేదు. దీంతో వీఆర్‌ఓలు ఇంటి గేటుకు అతికించి వస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పశ్చిమ మండలంలో 385, గ్రామీణంలో 45, మధ్య మండలంలో 147, ఉత్తర మండలంలో 500, తూర్పు మండలంలో 128 నోటీసులు జారీ అయ్యాయి.
గతంలోనే చెల్లించిన డబ్బు ఏమైందో...
విజయవాడ కోనేరువారి వీధికి చెందిన విశ్రాంత అధికారి వేమూరి బాబురావు అమ్మ 1979 సంవత్సరంలో 586 గజాల స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఇల్లు నిర్మించారు. ఆమె మరణానంతరం ఆస్తుల విభజనకు వెళ్లగా.. పట్టణ భూపరిమితి చట్టం ప్రకారం ఈ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిపారు. దీంతో 747 జీవోకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకునేందుకు 2021 అక్టోబరులో 5.50 లక్షలు చెల్లించి, దరఖాస్తు చేశాం. మళ్లీ అదే ఇంటికి తాజాగా నోటీసు జారీ చేశారు. క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం రూ.3 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గతంలోనే చెల్లించిన డబ్బు ఏమైందో తెలియడం లేదంటున్నారు. ఇలా అనేక మంది పరిస్థితి ఇలానే ఉంది.