పేరుకే అది ప్రభుత్వ ఇసుక డిపో. కంప్యూటర్ ఉన్నా పుస్తకాల్లోనే లెక్కలు. సీసీ కెమెరాలు ఉన్నా పని చేయవు. ఎందుకంటే విద్యుత్ సరఫరా లేదు అనే జవాబు. ఇదీ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఇసుక డిపో వద్ద పరిస్థితి.
సీసీ కెమెరాలు, కంప్యూటర్లే కాదు... ఇసుక ఎంత తరలిపోతుందో తెలియటానికి ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి ఎందుకూ పనికి రాకుండా ఉంది. ఫలితంగా డిపో నుంచి ఇసుక ఎంత పోతుందో తెలియని పరిస్థితి. వే బ్రిడ్జి లేక 18 టన్నులకు మించిన లోడ్‌తో ఇసుక లారీలు దూసుకుపోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. స్టాక్ యార్డ్ అని పేరేగాని ట్రాక్టర్లు నేరుగా నదిలోకి వెళ్లి లోడ్ చేసుకొని పోతున్నా... సంబంధిత అధికారులకు మాత్రం కనపించటం లేదనే విమర్శలున్నాయి.