కరోనా నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులు దాటుకుని కూటి కోసం.. కూలి కోసం వలస వచ్చిన కార్మికులు, కూలీలు తమ సొంతూళ్లకు తిరుగుముఖం పట్టారు. ప్రభుత్వం కల్పించే శ్రామిక రైళ్లు, బస్సుల్లో అవకాశాలు లేని వారంతా- ఏదో ఒకలా తమ స్వస్థలాలకు చేరకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగిపోతున్నారు. ఎన్ని రోజులకు తమ సొంతూరు చేరుకుంటారో తెలియని పరిస్థితుల్లో.. ఒంటిలోని సత్తువనంతా కూడ దీసుకుని ఒక్కో అడుగూ వేసుకుంటూ ఏదో ఒకరోజుకు ఇంటి ముఖం చూడకపోతామో ఆనే ఆశతో కదులుతున్నారు.
నిప్పులు చెరుగుతున్న ఎండ, ఆకలి, దాహం వంటి కష్టాలను పంటి బిగువన భరిస్తున్నారు. చెన్నై నుంచి నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి మహిళలతో సహా అంతా తమ సామగ్రిని నెత్తిన పెట్టుకుని బహుదూరపు బాటసారులుగా సాగిపోతున్నారు. విజయవాడ నగరంలోని ప్రధాన జాతీయ రహదారి మీదుగా ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా వైపు కదులుతున్న బాటసారులు ఈటీవీ భారత్ తో ఇలా తమ గోడు వెళ్లబోసుకున్నారు.