KTR on Amara Raja Group Investments: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 9వేల 500 కోట్లు పెట్టుబడి పెట్టండంతోపాటు 4 వేల 500 మంది ఉపాధి కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌తో పాటు లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం- అమర్‌రాజా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమన్న గల్లా జయదేవ్.. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లల్లో తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని తెలిపారు. తెలంగాణలో మా సంస్థ ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందని జయదేవ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న అమర్‌రాజా సంస్థకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్.. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందన్న కేటీఆర్.. అమరరాజా కంపెనీకి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.