కృష్ణా జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు.. ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని చెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ గ్రామాల్లో 130 సమస్యాత్మక, 83 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో డీఎస్పీ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 1587 మంది పోలీసు సిబ్బంది, 1615 మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారని ఎస్పీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో మద్యం, డబ్బు అక్రమ రవాణా అరికట్టేందుకు 60 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా గొడవల్లో పాల్గొంటే.. రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కింద అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ప్రజలంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు.