పదేళ్ల పాప సహా ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో సంచలనం రేకెత్తించింది. విస్సన్నపేట సమీపంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ వద్ద ఉదయం నడకకు వెళ్లినవారు.. అక్కడ మృతదేహాలను చూసి రోడ్డు ప్రమాదం జరిగినట్లు భావించి పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన ముగ్గురూ కాలువ ఒడ్డు నుంచి సుమారు ఐదు అడుగుల లోతులోని తుప్పల్లో విగతజీవులుగా పడిఉన్నారు. వీరు ఉపయోగించిన ఆటో సగభాగం మాత్రమే కాలువలోకి వెళ్లి, రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆటో అద్దాలను కర్రతో పగులగొట్టినట్లు ఉంది. వాహనంలోని పింగాణి వస్తువులు చెల్లాచెదురుకాలేదు. ముందుగా స్థానిక ఎస్.ఐ. సంఘటన స్థలం వద్దకు చేరుకొని విచారించారు. ఇది రోడ్డు ప్రమాదం అనుకొన్నారు. కానీ మృతదేహాలపై గాయాలను చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు నందిగామ, నూజివీడు డీఎస్పీలు రమణమూర్తి, బి.శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన పెళ్లూరి చిన్నస్వామి (35), అతని భార్య తిరుపతమ్మ (30), కుమార్తె మీనాక్షి (10)ల మృతి తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ తర్వాత వీరు హత్యకు గురైనట్లు భావించారు. చిన్నస్వామి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24గంటల్లోనే కేసును ఛేదించారు.
ఆగిరిపల్లి మండలం కొత్త ఈదరకు చెందిన పెళ్లూరి చినస్వామి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వ్యాపారి దాసరి వెంకన్న వద్ద పని చేస్తున్నాడు. వీళ్లిద్దరు ఇంటిని అద్దెకు తీసుకుని నూజివీడులో ఉంటున్నారు. వెంకన్న వద్ద ప్లాస్టిక్, పింగాణి వస్తువులను తీసుకుని చినస్వామి గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ విక్రయిస్తుంటాడు. చినస్వామి తన యజమాని భార్యతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంకన్న ఆగ్రహంతో రగిలిపోయాడు. చినస్వామిని హతమార్చడం కోసం పథకం పన్నాడు. తన భార్య, కుమారుడి సహకారంతో చినస్వామికి మద్యం తాగించి రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి సమీపంలో ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చారు.