క్రమంగా కోలుకుంటున్న మోటూరు గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యం Students health: కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని మోటూరు గురుకుల పాఠశాలలో 40 మందికి పైగా విద్యార్థినులు.. గురువారం అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని అత్యుత్సాహం కారణంగానే.. విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బ్యాటరీ రీఛార్జ్ అనే ప్రోగ్రాంలో భాగంగా.. గురువారం సాయంత్రం ఐదు గంటలకు 6,7,8 తరగతులకు చెందిన రెండు వందల మంది విద్యార్థినులు.. 800 మీటర్లు పది రౌండ్ల చొప్పున పరిగెత్తమని ఆదేశించడంతో పరుగు ప్రారంభించారు. మూడు రౌండ్లు ముగిసేసరికి ఒక్కొక్కరుగా నలభై మందికి పైగా విద్యార్థినిలు కుప్పకూలిపోయారు. దీంతో వారిని సమీపంలోని గుడివాడ మండల పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
కోలుకున్న పలువురు విద్యార్థినులను తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు తీసుకెళ్లగా.. ఆందోళనకరంగా ఉన్న తొమ్మిది మందిని ఆటోల ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి సకాలంలో వైద్యం అందించారు. విద్యార్థినులు కోలుకోవడంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉపాధ్యాయులపై మండిపాటు..:విద్యార్థినులను సంరక్షించాల్సిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వ్యవహారశైలిపై పలువురు మండిపడుతున్నారు. ఒక్కసారిగా ఒత్తిడికి గురవడం, బాడీ డీహైడ్రేషన్ కారణంగానే విద్యార్థులంతా అస్వస్థకు గురయ్యారని డాక్టర్ జయ శ్రీ స్పష్టం చేశారు. పాఠశాలలో జరిగిన కలకలంపై గుడివాడ ఆర్డిఓ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ నిర్వహిస్తామని, ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుడివాడ తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు
తెదేపా నేత పరామర్శ: అస్వస్థతకు గురైన విద్యార్థినులను.. తెదేపా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పరామర్శించారు. పాఠశాల హాస్టల్ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ పలువురు వాపోయారు. తమ ఇబ్బందులను చెబితే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరించడం దారుణమని.. రావి వెంకటేశ్వరరావు అన్నారు. పాఠశాల అధ్యాపకుల తీరు మారకుంటే తెదేపా ఆధ్వర్యంలో పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు.
సంబంధిత కథనం:
కృష్ణాజిల్లాలో 9 మంది విద్యార్థినులకు అస్వస్థత