దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్‌ఐ... తవ్వడానికి వీల్లేదంటూ జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో మీదికి వెళుతూ ఆయన్ను బెదిరించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆర్‌ఐపై తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకోకపోవడంతో.. మట్టి తవ్వకాలు ఆపేశారు. మట్టి తవ్వడం చట్టవిరుద్ధమని చెబుతున్నా వినకుండా అడ్డుకున్న తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆర్‌ఐ అరవింద్ వాపోయారు.
'మోటూరులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని..నాకు గుడివాడ తహశీల్దార్ నుంచి ఫోన్ వచ్చింది.. వీఆర్‌ఏ, వీఆర్‌వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లా.. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు.. మట్టి తవ్వకాలను అపాలని హెచ్చరించా.. మట్టి తవ్వకాలు ఆపకుండా నాతో వాగ్వాదం చేశారు.. జేసీబీతో నాపై దాడి చేశారు.. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా.. పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేశారు.' -అరవింద్, ఆర్‌ఐ
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అండతోనే గుడివాడలో మట్టిమాఫియా చెలరేగిపోతుందని.. తెలుగుదేశం నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారిపై వైకాపా నేతలు దాడి చేయడాన్ని నేతలు ఖండించారు. దాడికి తెగబడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఐపై దాడి చేసిన వారి అరెస్టుకు రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మోటూరులో మట్టి తవ్వకాలను అడ్డుకున్న R.I. అరవింద్‌పై దాడి ముమ్మాటికీ.. కొడాలి నాని పనేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. మంత్రి పదవి పోయిన క్యాసినో స్టార్.. విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నామని.. ఇలా తన మాఫియా గ్యాంగులను అడ్డుకునే రెవెన్యూ అధికారులపై దాడులు చేయడమా అని నిలదీశారు. సీఎం ప్రోత్సాహంతోనే మట్టిమాఫియాలు, గడ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు యత్నించిన గడ్డం గ్యాంగ్ మట్టిమాఫియా అరాచకాలు పోలీసులకు పట్టవా అని నిలదీశారు.