ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా రైతులకు కన్నీరు తెప్పిస్తున్న నివర్‌ - కృష్ణాలో నివర్‌ తుపాను ప్రభావం

పంట సిరి అన్నదాత గుమ్మాన్ని ముద్దాడిన సమయం రానేవచ్చింది. బంగారు ధాన్య రాశులతో తులతూగే కాలం ఆసన్నమైంది. చేలు బాగున్నాయని.. చేసిన రుణాలు తిరిగి కట్టేస్తామని.. అప్పుల చెరలో ఉన్న ఆలి పుస్తెలతాడు మళ్లీ ఆమె మెడలో మెరుస్తుందని.. ఇలా ఎన్నో ఊసులు.. మరెన్నో ఆశలు.. ఇంతలోనే తుపాను రైతు పొలాలను చుట్టేసింది. పనలను మట్టి కరిపించేసింది.. ఆశలపై వరదనీరు పారింది. చివరికి కన్నీళ్లే మిగిల్చింది.

krishna district farmers effected by nivar
కృష్ణా రైతులకు కన్నీరు తెప్పిస్తున్న నివర్‌

By

Published : Nov 27, 2020, 1:55 PM IST

కృష్ణా రైతులకు కన్నీరు తెప్పిస్తున్న నివర్‌

నివర్‌ తుపాను ప్రభావంతో కృష్ణాజిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను నిలువునా ముంచేశాయి. వరికి తీవ్రనష్టం వాటిల్లింది. కోయని పొలాలు నేలవాలితే, కోసిన పంట నీటిలో నానుతోంది.

వేల హెక్టార్లలో..
గురువారం ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. జిల్లాలో వరితోపాటు కంది, పత్తి, మిర్చి, చెరకు, పసుపు పంటలు 2.60 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. వీటిలో ఎక్కువశాతం వరి నేలవాలిపోగా, వేల హెక్టార్ల వరకు పనలపై ఉంది. బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ఘంటసాల, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, పామర్రు ఇలా అనేక మండలాల్లో ఇప్పుడిప్పుడే వరి కోతలు కోస్తున్నారు. విస్సన్నపేట, మైలవరం కంచికచర్ల, తిరువూరు లాంటి పలు మండలాల్లో సగం మేర కోతలు పూర్తయ్యాయి. తుపాను హెచ్చరికలు చేస్తున్నా వాతావరణం పొడిగా ఉండటంతో కోతలు కోశారు. జిల్లాలోని ఆయా మండలాల్లో 25వేల హెక్టార్ల వరకు పంటలు నేలవాలిపోయాయి. పన తడిగా ఉందని ఎక్కువ రోజులు ఆరబెడితే కానీ ధాన్యం కొనరని చూస్తుంటే.. ఉన్న పంటను కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. చాలామంది రైతులు రబీలో అపరాలు సాగు చేసేందుకు మినుము విత్తనాలు చల్లారు. వాటిని కూడా నష్టపోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తం

వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో కార్యాలయం, విజయవాడ, నూజివీడు సబ్‌కలెక్టర్‌, గుడివాడ ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ ‌రూంలలో 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఒక్కో కంట్రోల్‌రూంలో ఐదుగురు చొప్పున విధులు కేటాయించారు. సముద్రతీర మండలాలైన బందరు, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్నులో కూడా కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. భారీవర్షాలు కురిస్తే జలమయమయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మోహనరావు పెడన మండలంలోని చేవెండ్ర తదితర ప్రాంతాల్లోని మునిగిన పొలాలను పరిశీలించారు. నీటి మునిగిన ప్రతిపంటను నమోదుచేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు బందరుతోపాటు చల్లపల్లి ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చదవండీ...కడపలో నివర్ తుఫాను తెచ్చిన కష్టాలు

ABOUT THE AUTHOR

...view details