నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం చంద్రబోస్ రాసిన మౌనంగానే ఎదగమని.. గీతానికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేరడీ రాశారు. దూరంగానే ఉండమని.- కొవిడ్ నీకు చెబుతోంది... దగ్గరకొస్తే పాజిటివ్ అనే అర్ధమందులో ఉంది. కలయికలు పెరిగినచోటే కొవిడ్ పిలుపు వినిపిస్తోంది. మాస్కులన్నీ రాలినచోటే కరోనా వైరస్ చిగురిస్తోందంటూ... పాటరూపంలో తన పాటను చంద్రిక అనే గాయనితో పాడించారు.
కొవిడ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా వ్యాధి పట్ల ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని- కానీ నిర్లక్ష్యంగా ఉంటే ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో ఒకరకంగా కొవిడ్ రెండో దశ వ్యాప్తి చెందుతున్నట్లుగా భావించవచ్చని అన్నారు. ఎక్కువ పాజిటివ్ కేసులు లేకపోయినా- వ్యాధి ఇంకా తగ్గుముఖం పట్టడం లేదన్నారు. ప్రస్తుతం వైద్యం, ఔషధాలు అందుబాటులో ఉన్నందున మొదట్లో ఉన్నంత ఆందోళన ఇప్పుడు చెందాల్సిన అవసరం లేకపోయినా- వ్యాక్సిన్ వచ్చే వరకు సురక్షిత మార్గాల ద్వారా కరోనా కట్టడికి అంతా ప్రయత్నాలు చేయాల్సిందేనని ఆయన సూచించారు.