కృష్ణా జిల్లా(Krishna District) మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామం దీపావళి ప్రత్యేకత(diwali celebrations)ను చాటుకుంటోంది. ఇక్కడి చిన్నారులు మతాబులు, చిచ్చుబుడ్లు కావాలని తల్లిదండ్రులను అడగరు. టపాసులు పేల్చితే పర్యావరణం కాలుష్యం అవుతుందని... అనవసర ధ్వని కాలుష్యం ఎందుకని భావించి వాటికయ్యే డబ్బు దాచుకుని పొదుపుచేసుకుంటున్నారు.
అదే సమయంలో దీపావళి(diwali)ని పాత పద్ధతిలోనే సరికొత్తగా చేసుకుంటున్నారు. దీపావళికి 10 రోజుల ముందే రంపం పొట్టు, తాటి గులకలు కాల్చి వాటిని ఎండబెట్టి పొడి చేస్తారు. ఆ పొడిని గుడ్డలో గుండ్రంగా చుట్టి దానికి ఆవుపేడ రాసి ఎండలో 3 రోజులు ఎండబెడతారు. తాటిచెట్టు కమ్మను చీల్చి ఆ పొట్లాన్ని దానిలో ఉంచి పైన తాడుకట్టి వేగంగా తిప్పడంతో చుట్టూ నిప్పు రవ్వలు చిమ్ముతూ నిప్పుల వాన కురుస్తుంది. నిప్పుల పూలు వెలుగులు విరజిమ్ముతాయి.