Negligence on Krishna Delta Canals: వేల ఎకరాల సాగుకు ఆధారమైన పంటకాల్వ.. ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథీన్ సంచులు, పిల‌్లల డైపర్లు.. ఇలా ఒకటేంటి.. ఇదో డంపింగ్ యార్డులా తయారైంది. కనుచూపు మేరలో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పోనీ.. కాలువ గట్లైనా చక్కగా ఉన్నాయా అంటే అదీలేదు. ఏపుగా పెరిగిన కంపచెట్లతో అస్తవ్యస్థంగా తయారయ్యాయి. మొత్తంగా ఇవి పంట కాల్వలని కొత్త వ్యక్తులు కనిపెట్టలేని దుస్థితికి చేరాయి. కొన్నేళ్లుగా.. పూడిక తీయించక.. కాల్వలు ఇలా రూపురేఖలు కోల్పోతున్నాయి. ప్రధాన కాలువలే ఇలా ఉంటే.. ఇక డిస్ట్రిబ్యూటరీ కాలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చాలాచోట్ల గట్లు తెగిపోయాయి.
కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పరిస్థితి: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని.. గుంటూరు ఛానల్, కుడిగట్టు, తూర్పు, పశ్చిమ, నిజాంపట్నం, హైలెవల్ , కొమ్మూరు కాలువల కింద.. 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. గుంటూరు ఛానల్, కొమ్మమూరు కాలువలపై.. లాకుల గురించి అధికారులు.. ఎప్పుడో మర్చిపోయారు. వాళ్లకే గుర్తుండి ఉండే.. వాటిని తాళ్లతో కట్టేయాల్సిన అవసరం ఏముంటుంది?
ఎప్పుడైనా ఇటువైపు వచ్చి ఉంటే ఈ తలుపులు ఎప్పుడు విరిగాయో తెలిసేవి. వాటి లాకులు ఇప్పుడు తిప్పినా తిరగవు. పూర్తిగా.. స్ట్రక్ అయిపోయాయి. నీరు పోకుండా ఉండేందుకు ఏవో కర్రలు అడ్డంపెట్టి కట్టేశారు. మళ్లీ వాటిని తొలగించి కొత్త గేట్ పెట్టాలనే సంగతే మర్చిపోయినట్లున్నారు. గతంలో.. కొమ్మమూరు కాలువ ఆధునీకరణ 410 కోట్లతో చేపట్టినా ప్రస్తుతం ఆ పనులూ.. ఆర్ధాంతరంగా ఆపేశారు. బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి.
కృష్ణా తూర్పు డెల్టా కాలువల పరిస్థితి: ఇక కృష్ణా తూర్పు డెల్టా కాల్వల పరిస్థితీ పశ్చిమ డెల్టాకు భిన్నమేమీ కాదు. కృష్ణా తూర్పు డెల్టాలోని ఏలూరు, బందరు, రైవస్, బంటుమిల్లి, కాంప్ బెల్ లాంటి 9 ప్రధాన కాలువల పరిధిలో 7.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు పరిరక్షించాలన్న ధ్యాసే ప్రభుత్వానికి లేదు. ఏ కాలువ చూసినా తూటి కాడలు.. పిచ్చిచెట్లు, గుర్రపు డెక్కే కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు, కొలవెన్ను, పునాదిపాడు, ప్రొద్దుటూరు, పామర్రు నియోజకవర్గంలోని కొమరవోలు డ్రెయిన్లో జమ్ము, తూడు దట్టంగా అల్లుకుని అధ్వానంగా తయారైంది. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం,అవనిగడ్డ తదితర ప్రాంతాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే ప్రధాన కాలువలదీ అదే దుస్థితి. ముందే నీళ్లు విడుదల చేశామని.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. అవి సాఫీగా చేలకు చేరే పరిస్థితి లేదు.