ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2020, 11:34 AM IST

ETV Bharat / state

సొంత గూటికి.. ఒట్టి చేతులతో!

నెత్తిన మూటలు, చంకలో పిల్లల్ని మోస్తూ వందలు.. వేల సంఖ్యలో శ్రమశక్తి కదిలిపోతోంది. జిల్లా అభివృద్ధికి చెమటను ధారబోసిన కార్మిక ఆస్తి.. వందల కిలోమీటర్లు దాటి తరలిపోతోంది.

KRISHAN DISTRICT MAIGRANT DIFFICULTIES
కృష్ణా జిల్లా వలస కూలీల కష్టాలు

కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, మైలవరం, నూజివీడు, నందిగామ, తిరువూరు, పెడన, గూడూరు, గుడ్లవల్లేరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో వలస కూలీలు భారీ సంఖ్యలో ఉన్నారు. పల్లెల్లో వ్యవసాయ పనులకు తాత్కాలికంగా వస్తుంటారు. సీజన్‌ పూర్తి కాగానే తిరిగి వారి రాష్ట్రాలకు వెళ్లిపోతారు. పట్నాల్లోనూ అనేక రకాల పనులు చేసుకుంటున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్ర పరిధిలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో ప్రధాన పట్నాల్లో స్థిరపడ్డారు. భవన నిర్మాణం, ఆటో, హమాలీ, హోటళ్లు, దుకాణాలు, ఇంజినీరింగ్‌ పనులు, తోపుడు బళ్ల నిర్వహణ, రవాణా రంగం, ఐస్‌క్రీం, పానీపూరీ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యవసాయ, ఆక్వా ఆధారిత పంటలు, పరిశ్రమలు, ఇతర రకాల పనులు చేసుకుంటూ వీరంతా జీవితాలను ఇన్నాళ్లూ సాగించారు.

కొందరు చిన్న గదుల్లో అద్దెకు ఉంటుంటే.. ఇంకొందరు ఖాళీ స్థలాల్లో పాకలు వేసుకుని కాలం వెళ్లబుచ్చారు. మరికొందరు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రోడ్డ పక్కనే బతుకులీడ్చారు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా వీళ్లంతా ఇప్పుడు కాలిబాటన సొంతూళ్లకు బయలుదేరారు.

రానున్న రోజుల్లో కూలీల కొరత..

జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చినవారే. వీరంతా ఒకేసారి జిల్లాను వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పట్లో తిరిగొచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. దీంతో భవిష్యత్తులో జిల్లావ్యాప్తంగా కూలీల కొరత ఏర్పడే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా నిర్మాణాలు, ఇతర వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, కర్మాగారాలు తెరుచుకుంటాయి.

అప్పటికి దాదాపుగా వలస కూలీలు 90 శాతానికిపైగా ఖాళీ అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లో కూలీల కొరత ఆయా రంగాలపై తీవ్రంగా పడనుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయాన్ని ఇప్పటి నుంచే ఆలోచించాలి. వలస కూలీల బతుకులకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన తరుణమిది.

ఇదీ చదవండి:

మహానగరంలో మానుపిల్లి హల్​చల్

ABOUT THE AUTHOR

...view details