ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలవెలబోతున్న కొండపల్లి ఖిల్లా ! - kondapally

చారిత్రక విశేషాలకు అత్యాధునిక హంగులద్ది శిధిలావస్థకు చేరిన కొండపల్లి ఖిల్లాకు ఊపిరిపోసింది పురావస్తు శాఖ. కొండపల్లి ఖిల్లాను అత్యద్భుతంగా తీర్చిదిద్దినా...ఆ అనుభూతిని పొందేందుకు మాత్రం పర్యాటకులు ముందుకు రావడంలేదు.

వెలవెలబోతున్న కొండపల్లి ఖిల్లా !

By

Published : Aug 21, 2019, 5:40 AM IST

ఆరు నెలలు గడిచినా అంతంత మాత్రమే...
కొండపల్లి ఖిల్లా...ఎంతో ఘన చరిత కలిగిన ఈ పురాతన కట్టడం...పాలకులు సీతకన్నేయడం వల్ల శిథిలావస్థకు చేరిపోయింది. నవ్యాంధ్య ఏర్పడిన తర్వాత...పురావస్తు శాఖ ఈ ఖిల్లాపై దృష్టి సారించి... కనుమరుగైపోతున్న కోటకు మళ్లీ జీవం పోసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి... కొండపల్లి చారిత్రక విశేషాలను కళ్లకు కట్టేలా అద్భుతంగా పునరుద్ధరించింది. సాంకేతిక పరిజ్ఞానంతో సొబగులు అద్దుతుంటే...రాజధాని ప్రాంతానికి తలమానికంగా కొండపల్లి ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పునరుద్ధరించిన కొండపల్లి ఖిల్లాను ప్రారంభించి ఆరు నెలలు గడిచిపోయినా పర్యాటకులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నారు.
రాజుల ఛాయాచిత్రాలు మాట్లాడినా...
కొండపల్లి ఖిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే అన్ని హంగులు ఉన్నాయి. క్యూఆర్ సాంకేతికతో కోటలో ఏర్పాటు చేసిన మ్యూజియంలోని రాజుల ఛాయాచిత్రాలు మాట్లాడతాయి కూడా. కొండపల్లి కోటలో ఇప్పుడు అభివృద్ధి చేసింది కొంత భాగామే. ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన మ్యూజియం, గ్యాలరీ హాల్ తో పాటు కోట మొత్తం సీసీ కెమెరాల నిఘాలోనే ఉంటుంది. ఇంత చేసినా పర్యాటకుల సంఖ్య పెరగకపోవడంతో కొండపల్లి ఖిల్లా డీలా పడిపోతోంది. నరులకు బదులు వానరాలకు ఆతిథ్యమిస్తూ కనిపిస్తోంది.
3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్
కొండపల్లి ఖిల్లా పునరుద్ధరణలో చెప్పుకోదగ్గది 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్.... కొండపల్లి చరిత్రను కళ్లకు కట్టేలా కోట గోడలపై ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా దీన్ని రూపొందించినా... ఈ ప్రదర్శన చూసేందుకు సందర్శకులు కరవయ్యారు. ఫలితంగా ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రదర్శన నిలిపివేశారు
ప్రత్యేక బస్సులు...
పర్యాటకులను ఆకర్షించేందుకు కొండపల్లికి ఆర్టీసీ బస్సులను సైతం నడుపుతున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.ఇబ్రహీంపట్నం రహదారి నుంచి కొండపల్లి కోటకు చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల అటవీ మార్గంలో ప్రయాణించాలి. కోటకు చేరే వరకు మొత్తం 19 మలుపులు ఉంటాయి. అక్కడక్కడా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా.... ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే ఇబ్బంది పడాల్సిందే. కొండపల్లి కోటను అభివృద్ధి చేస్తున్నప్పుడే ఈ రహదారిని సైతం అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఇంకా ఆ పనులు కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా కొండపల్లికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది.

వెలవెలబోతున్న కొండపల్లి ఖిల్లా !

ABOUT THE AUTHOR

...view details