hunger strike for Amaravati : రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రకు నిరసనగా ఇవాళ్టి(బుధవారం) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రాజధానిలోని అబ్బురాజుపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయాలనుకున్న వారు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఐదు శాతం భూమిని ఇళ్లు లేని పేదలకు నివాస స్థలాలుగా పంపిణీ చేసే అవకాశం సీఆర్డీఏ చట్టంలో ఉందని.. అలాగే రాజధాని పరిధిలో గత ప్రభుత్వం 5024 టిడ్కో ఇళ్లు నిర్మించిందన్నారు. ఈ రెండు అంశాలను పక్కన పెట్టిన జగన్... పారిశ్రామిక అవసరాలకు, ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన ప్రాంతంలో ఆర్-5 జోన్ పేరుతో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలని చెప్పి రాజధాని మాస్టర్ ప్లాన్‌ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రైతుల అభ్యంతరాలు పక్కనపెట్టి.. రైతుల అభ్యంతరాలను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసింది. రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా 500 ఎకరాలతో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్-5 జోన్ పరిధిలో మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల అమలుతో పాటు బలహీన వర్గాల ప్రజలకు రాజధాని ప్రాంతంలో నివాస గృహాలు ఇచ్చేందుకే ఆర్ 5 జోన్ అని ప్రభుత్వం చెప్తుండగా.. ఇదంతా కుట్ర అని అమరావతి రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
సీఆర్డీఏ చట్టానికి సవరణ.. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ 2022 అక్టోబర్ 18న జీవో విడుదల చేసింది. రాజధాని పరిధిలో స్థానిక సంస్థలు, ఎన్నికైన పాలకమండళ్లు లేకపోతే ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించారు. ఈ మేరకు ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి గత అక్టోబర్‌లో ముసాయిదా విడుదల చేయగా.. రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టుకు తెలియకుండా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోమని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహిస్తున్నారు.