సామాజిక అవసరాలు తీర్చగలిగే పరిశోధనలు అవసరమని భారత జాతీయ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, శాస్త్రవేత్త పద్మవిభూషణ్ డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్ అన్నారు. కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం తొమ్మిది, పదో స్నాతకోత్సవం బుధవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. వర్చువల్ పద్ధతిలో పుణె నుంచి ముఖ్య అతిథిగా డాక్టర్ రఘునాథ్ స్నాతకోపన్యాసం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన వినాశనాన్ని సరిదిద్దడంతోపాటు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.
పరిశోధనల కోసం కేంద్రం రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తోందన్నారు. మరో శాస్త్రవేత్త పద్మవిభూషణ్ విజయ్‌భత్కర్ మాట్లాడుతూ సాంకేతికతను సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ అవసరమన్నారు. ఇంజినీరింగ్‌లో కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు తెర తీయాలన్నారు. విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా ప్రపంచ జీవన గమనాన్ని మార్చగలిగే పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పరిశోధనలు విశ్వవిద్యాలయం చేపట్టిందన్నారు.