మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు-2020 ను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలను వెనక్కు తీసుకునేదాకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
నాలుగు సార్లు రైతులతో చర్చలు జరిపిన కేంద్రం.. చట్టాల ఉపసంహరణను తిరస్కరించటంతో తిరిగి ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా టోల్ ప్లాజాల దిగ్భంధనం, 14 నుంచి జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 17 నుంచి పార్లమెంట్ సభ్యులకు.. చట్టాల రద్దుకు కృషి చేయాలని వినతి పత్రాలు అందజేస్తామన్నారు.