ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మరో ఉద్దానంలా ఎ. కొండూరు.. 2 నెలల వ్యవధిలోనే 11 మంది మృతి

Kidney Problems: ఎ. కొండూరు మండలం మరో ఉద్దానంలా మారుతోంది. కిడ్నీ వ్యాధి సమస్య అక్కడ తీవ్రమవుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 11మంది కన్నుమూశారు. తాజాగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసింది. బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

By

Published : Feb 25, 2022, 7:44 AM IST

Published : Feb 25, 2022, 7:44 AM IST

kidney problems in krishna district
kidney problems in krishna district

మరో ఉద్దానంలా ఎ. కొండూరు.. 2 నెలల వ్యవధిలోనే 11మంది మృతి

A. Kondoor: కృష్ణా జిల్లా ఎ. కొండూరు మండలంలోని దాదాపు 15 తండాల్లోని ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 2 నెలల్లోనే కిడ్నీ సంబంధిత వ్యాధులతో 11మంది చనిపోయారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన కనీస సాయం కూడా అందకపోవడం, తాగునీటి కలుషితం, సరైన పౌష్టికాహారం లేకపోవడంతో కిడ్నీ బాధితుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. మూడేళ్ల క్రితం 15 వందల మంది కిడ్నీ బాధితులు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసింది. బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

కొవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లుగా స్క్రీనింగ్‌ పరీక్షలను అధికారులు పూర్తిగా నిలిపేశారు. అంతకుముందు కూడా ఏడాది పాటు పరీక్షలు పెద్దగా నిర్వహించలేదు. దీంతో బాధితుల సంఖ్య ఎంత పెరిగిందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ వద్ద సరైన సమాచారం లేదు. తాత్కాలికంగా స్థానిక వైద్యుల సూచన మేరకు నొప్పి మాత్రలు, ఉపశమన మందులను వాడుతూ నెట్టుకొస్తున్నారు. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారికి గత ప్రభుత్వ హయాంలో ఖర్చుల కోసం 10 వేల రూపాయలు ఇచ్చేవారు. రెండేళ్లుగా ఆ డబ్బులను ఇవ్వడం ఆపేశారు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోయారు. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేల పింఛను ఇస్తున్నారు. అలాగే.. కిడ్నీ సంబంధ వ్యాధుల బారినపడి వైద్యం చేయించుకుంటున్న వారికి 5 వేల రూపాయల పింఛను ఇవ్వాలని చాలామంది కోరారు. మందులు కూడా కొనుక్కునేందుకు డబ్బులు లేక.. వ్యాధి తీవ్రమై డయాలసిస్‌ వరకు వెళ్తున్నారు.

చాలాకాలంగా ఎ.కొండూరులో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు లేవు. కనీసం కిడ్నీకేర్‌ సెంటర్‌నైనా ఏర్పాటు చేయాలని... నెఫ్రాలజిస్ట్, జనరల్‌ ఫిజీషియన్‌ ఇద్దరు వైద్యులను నియమించాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు ఉచితంగా మందులను అందజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

వైద్యం కోసం విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు వెళ్లడం తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు వెళ్లి రావడానికే ప్రతీ నెలా కనీసం 5వేల రూపాయలకు పైగా ఛార్జీలు అవుతున్నాయని, తమ కోసం ప్రత్యేకంగా ఓ అంబులెన్స్‌ను అందుబాటులోనికి తీసుకురావాలని తండా వాసులు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్కీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఎమ్​హెచ్​వో వెల్లడించారు.

ఇదీ చదవండి:

దర్శి తహశీల్దార్​ను సస్పెండ్‌ చేస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details