ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేశినేని అలక... ఫేస్‌బుక్​లో వ్యంగ్యాస్త్రాలు

లోక్‌సభలో పార్టీ తరపున ఇచ్చిన విప్ పదవిని ఎంపీ కేశినేని నాని తిరస్కరించడం తెదేపాలో రాజకీయ దుమారం రేపింది. అంత పెద్ద పదవికి తాను అనర్హుడినంటూ నాని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ వచ్చి నానిని బుజ్జగించడం... తాను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని కేశినేని ఖండించడం వంటి పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.

ఎంపీ కేశినేని నాని

By

Published : Jun 6, 2019, 4:30 AM IST

ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక పాన్పు ఎక్కారు. అధినేత చంద్రబాబు వద్ద జరిగిన సమావేశానికి హాజరైన ఆయన శాంతించలేదన్నది... తాజా పరిణామాలతో అర్ధమైంది. లోక్‌సభలో పార్టీ ఉపనేత, విప్ పదవులను సున్నితంగా తిరస్కరించారు. తనకు పార్టీలో ప్రాధాన్యం కల్పించటం లేదనే అసంతృప్తితో... చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరయ్యారు. ముఖ్యనేతల సమావేశంలో చర్చించి పదవులు ఇవ్వడం వల్ల... ఫేస్‌బుక్‌లో నాని అసంతృప్తి గళం వినిపించారు.

లోక్​సభలో పార్టీ విప్ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నాని... తనకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంత పెద్ద పదవి చేపట్టడానికి తాను అనర్హుడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకున్నారని... వారి ఆశీస్సులు ఉన్నాయని... పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. పదవి తిరస్కరిస్తున్నందుకు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.

ఫేస్‌బుక్​లో కేశినేని పోస్ట్‌ చూసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌... విజయవాడలోని నాని కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. గంటకుపైగా వీరిద్దరి మధ్య ఏకాంత చర్చలు నడిచాయి. గల్లా జయదేవ్‌ కేశినేని నానిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. జయదేవ్‌తో భేటీకి ముందు కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. విప్ వద్దు అనడంపై ఎటువంటి రాజకీయం లేదన్నారు. ఫేస్​బుక్​లో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నానని స్పష్టం చేశారు.

ఈ సమావేశం అనంతరం కేశినేని నాని, గల్లా జయదేవ్‌లు ఇరువురూ కలిసి మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం రోజే ముగ్గురుకీ మూడు పదవులు అనుకున్నా... ఆ ప్రకటన ఎందుకు రాలేదో తెలియటం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా సమావేశంలో తనను బలపరిచిందే కేశినేని నాని అని జయదేవ్‌ వివరించారు.

తనకు ఆత్మాభిమానం ఎక్కువని... దాని కోసం ఆస్తులూ లెక్క చేయనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. భాజపాలోకి మారుతున్నాననే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. విప్ పదవి తన స్థాయికి తగదనుకున్నానన్న నాని... అందుకే వదిలేసుకున్నానని వివరించారు. గతంలో తాను చేయని తప్పుకు రవాణా శాఖ అధికారికి క్షమాపణ చెప్పానని గుర్తుచేశారు. పార్టీ తాత్కాలిక కార్యకలాపాలకు దేవినేని ఉమా కార్యాలయం బాగుంటుందని సూచించింది తానేనని... ఇందులో ఎలాంటి వివాదమూ లేదని కేశినేని నాని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

ABOUT THE AUTHOR

...view details