Kavitha and Sharmila tweet war: తెలంగాణలోని వరంగల్ పాదయాత్రలో జరిగిన ఘర్షణ, హైదరాబాద్‌లో షర్మిలను అరెస్ట్ చేయడం.. టీఆర్ఎస్, వైఎస్సార్టీపీ మధ్య మాటలయుద్ధానికి దారితీశాయి. షర్మిల, టీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. షర్మిల అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర నేతలు స్పందించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. నేరుగా బీజేపీ పేరు ప్రస్తావించ కుండానే.. ఆ పార్టీని ఉద్దేశించి పరోక్ష ఆరోపణలు చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందనా అంటున్న తామరపువ్వులు' అంటూ కవిత ట్వీట్ చేశారు. షర్మిల అరెస్టు వ్యవహారంలో టీఆర్ఎస్ సర్కార్ వైఖరిని తప్పుపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలనే ఉద్దేశించే.. కవిత నర్మగర్భంగా ట్వీట్ చేశారు.
కవిత ట్వీట్‌కు స్పందించిన షర్మిల.. ఆమె పేరు ప్రస్తావించకుండానే బదులిచ్చారు. పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదని.. కవితను ఉద్దేశించి విమర్శించారు. ఇచ్చిన హామీల అమలు చేసిందని.. పదవులే తప్ప పనితనం లేదని దుయ్యబట్టారు. గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదని షర్మిల వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.