కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాపవరంలో.. పదవి ఒకరిది, పెత్తనం మరొకరిది అన్నట్లు పరిస్థితి. గ్రామ పంచాయతీ తెదేపా బలపరిచిన.. చెరుకూరి పద్మావతి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
స్థానిక ఎమ్మెల్యే అండతో.. వైకాపా నాయకులు గ్రామంలోని చెరువు మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాపవరం గ్రామంలోని మంచినీటి చెరువు అభివృద్ధి కోసం, గతంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో.. చెరువులో మట్టిని బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల మెరక, అంతర్గత రహదారుల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వాడుకోవాలని తీర్మానం చేశారు. ఆ పనులు మొదలుపెట్టి మట్టిని మెరక పనులు చేయగా.. మిగిలిన మట్టిని అధికార పార్టీ నాయకులు యంత్రాలతో తవ్వించి అమ్ముకుంటున్నారని సర్పంచ్ ఆరోపణలు చేశారు.
చెరువు గట్టును సైతం తవ్వేస్తున్నారని.. గట్టుపై ఉన్న కొబ్బరిచెట్లు పడిపోయే విధంగా గట్లు తొలగిస్తున్నారని.. పంచాయతీకి వచ్చే ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని సర్పంచ్ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నిసార్లు పై అధికారులకు విన్నవించినా.. స్పందించటం లేదన్నారు. జిల్లా స్థాయి అధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చి.. అక్కడ ఎటువంటి అవకతవకలు జరగడం లేదని కింది స్థాయి అధికారులు నివేదికలు ఇస్తున్నారని తెలిపారు.